CM KCR: కొత్త రాష్ట్రం అయినప్పటికీ తెలంగాణ అసెంబ్లీ దేశానికే ఆదర్శంగా నిలిచింది: సీఎం కేసీఆర్

CM KCR attends BAC meeting

  • ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
  • స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం
  • అక్టోబరు 5 వరకు సమావేశాలు
  • విపక్ష సభ్యులకు కూడా అధిక సమయం ఇస్తున్నామన్న కేసీఆర్

తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ ఉదయం ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో నిర్వహించిన బీఏసీ సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ, తెలంగాణ అసెంబ్లీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. రాష్ట్ర శాసనసభ మరింత స్ఫూర్తిమంతంగా నిలిచేందుకు కొత్తగా కొన్ని విధివిధానాలు, నిబంధనలు రూపొందించుకోవాల్సి ఉందని పిలుపునిచ్చారు.

ప్రతిపక్ష సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్నా గానీ, వారికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నామని, భవిష్యత్తులోనూ ఆ పద్ధతి కొనసాగుతుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఓ సభ్యుడు లేవనెత్తే అంశం ప్రజోపయోగమైనది అయితే కావల్సినంత సమయం కేటాయించాలని పేర్కొన్నారు. ఇక సభలో ప్రవేశపెట్టే బిల్లులపై సభ్యులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు.

బీఏసీ సందర్భంగా, వర్షాకాల సమావేశాలను అక్టోబరు 5 వరకు జరపాలని నిర్ణయించారు. ఈ నెల 25 (శనివారం), 26 (ఆదివారం)తో పాటు అక్టోబరు 2 (గాంధీ జయంతి), అక్టోబరు 3 (ఆదివారం) సభా సమావేశాలకు సెలవు దినాలుగా ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ బీఏసీ సమావేశంలో సీఎం కేసీఆర్ తో పాటు రాష్ట్ర మంత్రులు ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి, కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News