Manchu Vishnu: చంద్రబాబుగారు నాన్నకు బంధువు.. జగన్ గారు నాకు బావ: మంచు విష్ణు
- 'మా' ప్రెసిడెంట్ అనేది ఒక బాధ్యత
- అసోసియేషన్ లో ఎన్నో మార్పులు తీసుకురాగలనని నమ్మకంగా చెప్పగలను
- ఎన్నికల్లో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవద్దని కోరుతున్నా
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష పదవికి మంచు విష్ణు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. నిన్ననే ఆయన తన ప్యానల్ ను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'మా' ప్రెసిడెంట్ అనేది ఒక బాధ్యత అని చెప్పారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడాన్ని తన తండ్రి మోహన్ బాబు ఇష్టపడటం లేదని అన్నారు.
2015-16 ఎన్నికల్లో తనను ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా పోటీ చేయమని దివంగత దాసరి నారాయణరావు, మురళీమోహన్ అడిగారని... అయితే అప్పుడు నాన్న తనను ఆపేశారని చెప్పారు. ఎందుకంటే అప్పుడు తన చేతిలో కొన్ని సినిమాలు ఉన్నాయని, పైగా తనకు అనుభవం కూడా లేదని అన్నారు. అయితే, ఇప్పుడు తాను 'మా'లో ఎన్నో మార్పులు తీసుకురాగలనని నమ్మకంగా చెప్పగలనని తెలిపారు.
అసోసియేషన్ లో ఉన్న 900 మందికి లైఫ్, మెడికల్ ఇన్స్యూరెన్స్ ఇవ్వడమే తన ప్రాధాన్యత అని విష్ణు చెప్పారు. ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవద్దని కోరుతున్నానని అన్నారు. చంద్రబాబు గారు నాన్నకు బంధువని, జగన్ గారు తనకు బావ అని... తనకు కూడా రాజకీయాలు తెలుసని చెప్పారు. ఈ ఎన్నికలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని... చివరి క్షణం కోసం తాను ఏకగ్రీవం కోసం ప్రయత్నించానని తెలిపారు.