Punjab Kings: హైదరాబాద్ ఖాతాలో మరో ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్!

PBKS overcome SRH in low scorer

  • 125 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడిన  హైదరాబాద్
  • 9 మ్యాచ్‌లు ఆడి గెలిచింది ఒక్కటే
  • ప్రయోజనం లేని జాసన్ హోల్డర్ మెరుపులు

ఐపీఎల్‌లో హైదరాబాద్ కథ ముగిసింది. గత రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. ఫలితంగా ఫే ఆఫ్స్‌ ఆశలు అడుగంటిపోయాయి. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో విజయం ఎట్టకేలకు పంజాబ్‌నే వరించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌ ప్రారంభించిన పంజాబ్‌ను హోల్డర్ దెబ్బతీశాడు. మూడు వికెట్లు పడగొట్టి పంజాబ్ భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశాడు. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగిన విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. 14 పరుగులు మాత్రమే చేసి రషీద్ ఖాన్ బౌలింగులో అవుటయ్యాడు. పంజాబ్ జట్టులో మార్కరమ్ చేసిన 27 పరుగులే అత్యధికం. కెప్టెన్ రాహుల్ 21 పరుగులు చేశాడు. మిగతా ఎవరూ చెప్పుకోదగ్గ ఆటతీరు కనబరచలేదు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది.

పంజాబ్‌ను స్వల్ప స్కోరుకే కట్టడి చేయడంతో సన్‌రైజర్స్ ఖాతాలో ఓ విజయం ఖాయమని అందరూ భావించారు. అయితే, పంజాబ్‌ బౌలర్లు రవి బిష్ణోయ్, షమీ దెబ్బకు హైదరాబాద్ వికెట్లు టపటపా రాలిపోయాయి. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 120 పరుగులు మాత్రమే చేసి 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. వృద్ధిమాన్ సాహా 31 పరుగులు చేయగా, చివర్లో జాసన్ హోల్డర్ మెరుపులు మెరిపించి జట్టుకు విజయాన్ని అందించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. 29 బంతుల్లో 5 సిక్సర్లతో అజేయంగా 47 పరుగులు చేసి జట్టును విజయం దిశగా నడిపించినప్పటికీ సహచర బ్యాట్స్‌మెన్ నుంచి అతడికి సహకారం అందలేదు. దీంతో ఆ జట్టు 120 పరుగులకే పరిమితమై 8వ పరాజయాన్ని మూటగట్టుకుంది. పంజాబ్‌కు ఇది నాలుగో విజయం కాగా, హైదరాబాద్‌కు 8వ ఓటమి. జాసన్  హోల్డర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.

ఐపీఎల్‌లో నేడు కూడా రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య అబుదాబిలో మధ్యాహ్నం 3.30 గంటలకు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-ముంబై ఇండయన్స్ మధ్య దుబాయ్‌లో 7.30 గంటలకు మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.

  • Loading...

More Telugu News