VC Sajjanar: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంచలన ఆదేశాలు.. ఇకపై అలా చేసే డ్రైవర్లపై కఠిన చర్యలు
- రోడ్డు మధ్యలో బస్సులు ఆపడంపై ఫిర్యాదులు
- అలా ఆపడం ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధమన్న సజ్జనార్
- ట్రాఫిక్ పోలీసుల ఫైన్‌ను డ్రైవర్లే చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిక
- క్రమ శిక్షణ చర్యలు కూడా తప్పవన్న ఆర్టీసీ ఎండీ
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీ బస్సులను రోడ్డు మధ్యలో ఆపి ప్రయాణికులను ఎక్కించుకుంటూ ప్రమాదాలకు కారణమవుతున్నట్టు వస్తున్న ఫిర్యాదులపై సజ్జనార్ స్పందించారు. ఇలాంటి ఘటనల వల్ల ఆర్టీసీ ప్రతిష్ఠ దెబ్బతింటోందని భావించిన ఆయన నష్టనివారణ చర్యలు ప్రారంభించారు. ఇకపై రోడ్డు మధ్యలో బస్సులను ఆపొద్దని ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్డు మధ్యలో బస్సులను ఆపడం ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధమని, ట్రాఫిక్ పోలీసులు కనక ఫైన్ వేస్తే ఆ మొత్తాన్ని సంబంధిత డ్రైవర్లే భరించాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అంతేకాదు, క్రమశిక్షణ చర్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రోడ్డు మధ్యలో బస్సులను ఆపడం నేరమన్న విషయంలో డ్రైవర్లను అప్రమత్తం చేయాలని, అందుకోసం డిపోల నుంచి రహదారులపైకి వచ్చేముందు డీజిల్ బంకుల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. డ్యూటీ చార్టులు ఇచ్చేముందు డ్రైవర్లకు సూపర్‌వైజర్లు ఈ విషయాన్ని వివరించి చెప్పాలని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే డ్రైవర్లపై కఠిన చర్యలు తప్పవన్న విషయాన్ని కూడా డ్రైవర్ల దృష్టికి తీసుకెళ్లాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.