YV Subba Reddy: జగన్ ఆదేశాలతో జక్కంపూడి రాజా, భరత్‌ను పిలిపించి మాట్లాడుతోన్న వైవీ సుబ్బారెడ్డి
- ఇటీవల రాజా, భరత్ మధ్య వివాదం
- సీరియస్ అయిన అధినేత జగన్
- సీఎం క్యాంపు ఆఫీసుకు రాజా, భరత్
- వివరణ కోరుతోన్న సుబ్బారెడ్డి
రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య ఇటీవల తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం చోటు చేసుకున్న సంగతి విదితమే. నేతలు హద్దులు దాటడంతో వైసీపీ అధిష్ఠానం దీనిపై దృష్టి సారించింది. దీనిపై సీఎం జగన్ సీరియస్‌గా ఉన్నారు. మార్గాని భరత్, జక్కంపూడి రాజా తాడేపల్లికి రావాలని పార్టీ హైకమాండ్ ఆదేశించడంతో వారు ఈ రోజు అక్కడకు వచ్చారు.
వారితో మాట్లాడి వివాదాన్ని పరిష్కరించే బాధ్యతను వైవీ సుబ్బారెడ్డికి అధిష్ఠానం అప్పగించింది. ఈ క్రమంలో సీఎం క్యాంపు కార్యాలయంలో ఆ ఇద్దరు నేతలతో సుబ్బారెడ్డి మాట్లాడుతున్నారు. వారిద్దరి నుంచి వివరణ తీసుకుని సీఎం జగన్ కు ఆయా అంశాలను సుబ్బారెడ్డి వివరించనున్నారు.
కాగా, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో మార్గాని భరత్ సెల్ఫీ దిగడం ఏంటంటూ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇటీవల విమర్శలు చేశారు. భరత్ కూడా దీటుగా స్పందించారు. దీంతో వారిద్దరి వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో జగన్ అక్రమాస్తుల కేసులో వీవీ లక్ష్మీనారాయణ విచారణ జరిపిన విషయం తెలిసిందే.