Cyclone Gulab: అరేబియా సముద్రంలో మరో తుపానుగా మరింత తీవ్రరూపం దాలుస్తున్న 'గులాబ్'
- ‘సైక్లోన్ షహీన్’గా మారుతోందన్న అధికారులు
- రేపటికి తీరాన్ని తాకే అవకాశం
- వాతావరణంలోని తేమే కారణం
- రుతుపవనాల తిరోగమనం ఆలస్యం వల్లే తేమ
సైక్లోన్ గులాబ్ తీరం దాటడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఎన్నో ప్రాంతాలను వరదలు ముంచేశాయి. భారీ స్థాయిలో పంటలకు నష్టం వాటిల్లింది. నిన్నటి నుంచి వర్షమైతే లేదు. ప్రస్తుతం సైక్లోన్ గులాబ్ తెలంగాణ, మరఠ్వాడా, విదర్భల్లో కేంద్రీకృతమైందని అధికారులు అంటున్నారు.
అయితే, సైక్లోన్ గులాబ్ పోతూపోతూ మరింత ఉగ్రరూపం దాలుస్తోందట. బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్.. ఇప్పుడు అరేబియాలో మరో తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతోందట. ‘సైక్లోన్ షహీన్’గా మారుతోందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరో నాలుగైదు రోజుల్లో అరేబియా సముద్రంలో వాయుగుండం ఏర్పడుతుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దాని ప్రభావంతో గుజరాత్, మహారాష్ట్రతో పాటు ఆయా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
ప్రస్తుతం విదర్భ వద్ద అరేబియాలో వాయుగుండం కొనసాగుతోందని, రేపటికి తీరాన్ని తాకే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో తేమ ఎక్కువగా ఉందని, సైక్లోన్ గులాబ్ బలహీనపడినా ఆ తేమ వల్లే తిరిగి శక్తి పుంజుకుంటోందని అంటున్నారు. సముద్రాన్ని చేరేకొద్దీ ఆ తేమతో తుపాను శక్తి పెరుగుతుందని కోల్ కతా ప్రాంతీయ వాతావరణ కేంద్ర సంచాలకుడు డాక్టర్ జి.కె. దాస్ చెప్పారు. ఈ ఏడాది రుతుపవనాల తిరోగమనం ఆలస్యమవుతోందని, దాని వల్ల వాతావరణంలో తేమ ఎక్కువ అవుతోందని చెప్పారు.