Team India: గంగూలీ ప్రతిపాదించినా.. కోచ్ పదవి మాత్రం అతనికి దక్కేలా లేదు!
- ఆసక్తి చూపని టీమిండియా దిగ్గజం అనిల్ కుంబ్లే
- మిగతా బీసీసీఐ సభ్యులు కూడా విముఖత
- విదేశీ కోచ్‌ను తీసుకువచ్చే యోచనలో సభ్యులు
టీమిండియా తదుపరి కోచ్ ఎవరనే విషయంపై విపరీతమైన చర్చ జరుగుతోంది. రవిశాస్త్రి పదవీకాలం ముగియనుండటంతో ఈ పదవి ఎవరికి దక్కనుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎలాగైనా ఈ పదవిలో దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లేను కూర్చోబెట్టాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భావిస్తున్నాడని తెలుస్తోంది. కోచ్ విషయంలో జరిగిన బీసీసీఐ సమావేశంలో కూడా అనిల్ కుంబ్లే పేరును గంగూలీ ప్రతిపాదించాడట.
అయితే మిగతా సభ్యులు మాత్రం కుంబ్లే ఎంపిక సరైందని కాదనే అభిప్రాయంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు కొంతకాలం జట్టుకు కోచ్‌గా కుంబ్లే సేవలందించాడు. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆ స్థానం నుంచి తప్పుకున్నాడు. ఆ సమయంలో టీమిండియా కెప్టెన్ కోహ్లీకి, కుంబ్లేకి సరిపడటంలేదనే వార్తలు గుప్పుమన్నాయి.
గంగూలీ చేసిన ప్రతిపాదనపై కుంబ్లే కూడా అనాసక్తిగానే ఉన్నాడట. దీంతో బీసీసీఐ పెద్దలంతా కలిసి జట్టుకు విదేశీ కోచ్‌ను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో కూడా పంజాబ్ కింగ్స్ జట్టు కోచ్‌గా కుంబ్లే పెద్దగా ప్రభావం చూపలేదని కొందరు వాదిస్తున్నారట. దీంతో కుంబ్లే కాదంటే వీవీఎస్ లక్ష్మణ్‌కు ఈ పదవి కట్టబెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే రవిశాస్త్రి పదవీకాలం ముగిసే లోపు ఎవరి మనసులైనా మారొచ్చని కొందరు బీసీసీఐ అధికారులు అంటున్నారు.