Chhattisgarh: అటు పంజాబ్ కాంగ్రెస్ రాజకీయాల్లో వేడి.. ఇటు ఛత్తీస్‌గఢ్‌లోనూ మళ్లీ మొదటికొచ్చిన ఆ పార్టీ నేతల తీరు
- కాంగ్రెస్ అధిష్ఠానానికి మళ్లీ తలనొప్పి
- 15 మంది ఛత్తీస్‌గఢ్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి
- ముఖ్యమంత్రి మార్పుకోసమేనని ప్రచారం
ఛత్తీస్‌గఢ్ రాజకీయాలు నెల రోజుల క్రితం ఊహించని మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నేతల్లో తలెత్తిన విభేదాల వల్ల ముఖ్యమంత్రి మార్పు జరుగుతుందని నెల రోజుల క్రితం బాగా ప్రచారం జరిగింది. దీంతో పార్టీ అధిష్ఠానం అక్కడి పరిస్థితులను చక్కదిద్దింది.
అయితే, ఈ పార్టీలో ఇప్పటికీ స్థిరత్వం రాలేదని తెలుస్తోంది. ఆ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నారు. తాము రాహుల్ గాంధీని కలవడానికే ఢిల్లీకి వచ్చినట్లు వారు చెప్పారు. వారు ముఖ్యమంత్రి మార్పు గురించి ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. దీంతో ఆ రాష్ట్రంలోనూ పార్టీ నేతల్లో ఉన్న విభేదాలు మళ్లీ బయటపడుతున్నాయి.
ప్రస్తుత ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ స్థానంలో సింగ్‌దేవ్‌ను ముఖ్యమంత్రిగా నియమించాలని కొందరు ఎమ్మెల్యేలు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నేత నవజోత్ సిద్ధూ ఇతర పార్టీల్లో చేరతారన్న ప్రచారం జరుగుతోంది.
పంజాబ్ లో ఇలా ఎన్నికల ముందు చోటు చేసుకుంటోన్న ఈ పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. ఆ రాష్ట్రంలో పార్టీని చక్కదిద్దేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం చేస్తోన్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. ఇప్పుడు పంజాబ్‌తో పాటు ఒకేసారి ఛత్తీస్‌గఢ్ అంశం కూడా మళ్లీ మొదటికి రావడం కాంగ్రెస్ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది.