Andhra Pradesh: కొత్త విధానంలో జీవోల జారీ ఎందుకంటూ ఏపీ సర్కారుకు హైకోర్టు ప్రశ్న
- కొత్త విధానమెందుకని నిలదీత
- వచ్చేనెల 27లోపు అఫిడవిట్ వేయాలని ఆదేశం
- ఈ–గెజిట్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్
ఏపీ ప్రభుత్వం తన జీవోలను నూతన విధానంలో జారీ చేయడంపై హైకోర్టు సర్కారును ప్రశ్నించింది. జీవోఐఆర్ వెబ్ సైట్ లో కాకుండా ఈ–గెజిట్ ద్వారా ఉత్తర్వులను విడుదల చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై ఇవాళ హైకోర్టు విచారించింది.
వారానికి ఒకసారే జీవోలను ఈ–గెజిట్ ద్వారా వెలువరించడం చట్టవిరుద్ధమని పిటిషనర్ల తరఫు లాయర్ వాదించారు. రహస్యంగా ఉంచాల్సిన జీవోలని పేర్కొంటూ వాటిని దాచిపెట్టడమూ చట్టవిరుద్ధమన్నారు. దానిపై స్పందించిన కోర్టు.. జీవోల జారీకి అసలు నూతన విధానమెందుకు? అని సర్కారును ప్రశ్నించింది. వచ్చే నెల 27 లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.