Punugu Pilli: శేషాచలం అడవుల్లో ఉండే అరుదైన జీవి విజయవాడలో ప్రత్యక్షం
- స్థానిక బృందావన కాలనీలో పునుగుపిల్లి దర్శనం
- ఓ ఇంట్లోకి వెళ్లిన వన్యప్రాణి
- ఓ బోనులో బంధించిన స్థానికులు
- పునుగుపిల్లిని తీసుకెళ్లిన అటవీశాఖ అధికారులు
విజయవాడలో అరుదైన వన్యప్రాణి దర్శనమిచ్చింది. స్థానిక బృందావన కాలనీలో చెట్లపై తిరుగుతున్న ఈ జీవిని పునుగు పిల్లిగా గుర్తించారు. పునుగుపిల్లులు సాధారణంగా తిరుమల శేషాచల అడవుల్లో సంచరిస్తుంటాయి. ఈ పునుగుపిల్లికి చెందిన ప్రత్యేకమైన స్రావం ఎంతో సుగంధభరితమైనది. దీన్ని తిరుమల శ్రీవారి కైంకర్యాల్లో వినియోగిస్తుంటారు.
విజయవాడలోని బృందావన కాలనీలో తిరుగాడుతున్న ఈ పునుగుపిల్లి ఎ-కన్వెన్షన్ సెంటర్ సమీపంలోని ఓ ఇంట్లోకి ప్రవేశించగా, ఆ ఇంటివారు తలుపులు మూసి దాన్ని బోనులో బంధించారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారు వచ్చి పునుగుపిల్లిని తీసుకెళ్లారు.
తిరుమల నిత్యాన్నదానానికి కూరగాయలు తీసుకెళ్లేందుకు అక్కడి నుంచి వాహనాలు విజయవాడ వస్తుంటాయి. వాటి ద్వారా పునుగుపిల్లి విజయవాడ చేరుకుని ఉంటుందని భావిస్తున్నారు.
కాగా, పునుగుపిల్లి ఎంతో పవిత్రమైనదని, ఇది ప్రవేశించిన ఇంటికి అదృష్టం కలిసొస్తుందని స్థానికులు చెప్పుకుంటున్నారు.