Amarinder Singh: నేను బీజేపీలో చేరను... కాంగ్రెస్ లో కూడా ఉండను: అమరీందర్ సింగ్ స్పష్టీకరణ

I will not join BJP says Amarinder Singh

  • 52 ఏళ్లుగా కాంగ్రెస్ లో ఉన్నా
  • ఇప్పుడు నా విశ్వసనీయత ప్రమాదంలో పడినట్టే కదా? 
  • నమ్మకం లేనప్పుడు ఎవరూ కొనసాగలేరు

కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఒత్తిడి మేరకు పంజాబ్ సీఎం పదవికి ఇటీవలే అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో గంటకు పైగా సమావేశమయ్యారు. దీంతో ఆయన బీజేపీలో చేరబోతున్నారనే వార్తలకు బలం చేకూరింది. అయితే, ఈరోజు అమరీందర్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీలో చేరబోనని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో కూడా కొనసాగలేనని క్లారిటీ ఇచ్చారు.

"ఇంత కాలం కాంగ్రెస్ తో కలిపి ప్రయాణం చేయడం సంతోషంగా ఉంది. నా పరిస్థితి ఏమిటో ఇప్పటికే నేను స్పష్టంగా చెప్పాను. నా పట్ల ఇంత దారుణంగా వ్యవహరించడం బాధాకరం. పార్టీకి ఇంత సేవ చేసిన నా పట్ల ఇలా వ్యవహరించి ఉండకూడదు. 52 ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నాను.

నాకంటూ కొన్ని సిద్ధాంతాలు, నమ్మకాలు ఉన్నాయి. ఉదయం 10.30 గంటలకు సీఎం పదవికి రాజీనామా చేయాలని పార్టీ ప్రెసిడెంట్ ఆదేశించారు. నేను వారిని ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. ఇప్పుడే చేస్తానని చెప్పాను. అదే రోజు సాయంత్రం నేను గవర్నర్ ను కలిసి రాజీనామా లేఖను అందించాను. 50 ఏళ్ల తర్వాత నన్ను మీరు అనుమానిస్తే, నా విశ్వసనీయత ప్రమాదంలో పడినట్టే కదా? నాపై నమ్మకం లేకపోతే... కాంగ్రెస్ లో ఉండి ఏం ప్రయోజనం? నమ్మకం లేనప్పుడు ఎవరూ కొనసాగలేరు" అని అమరీందర్ వ్యాఖ్యానించారు.

అమిత్ షాతో భేటీ కావడంపై మీడియా అడిగిన ప్రశ్నకు బదులుగా... తాను బీజేపీలో చేరడం లేదని సమాధానమిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి తాను ఇంత వరకు రాజీనామా చేయలేదని చెప్పారు. తాను క్షణాల్లో నిర్ణయం తీసుకునే వ్యక్తిని కాదని అన్నారు.

  • Loading...

More Telugu News