Vishnu Vardhan Reddy: 'కాంగ్రెస్ యజమాని' అంటూ రాహుల్ గాంధీపై విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలు
- పంజాబ్ లో రాజకీయ సంక్షోభం
- కాంగ్రెస్ అధిష్ఠానంపై కపిల్ సిబాల్ ధ్వజం
- సిబాల్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి
- రాహుల్ కనీసం ఖండించలేదన్న విష్ణు
కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయి అధినేత లేనందువల్లే పంజాబ్ తరహా రాజకీయ సంక్షోభాలు చెలరేగుతున్నాయని ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబాల్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. నాయకత్వ లోపమే కాంగ్రెస్ లో అంతర్గత అలజడులకు దారితీస్తోందని ఆయన విమర్శించారు. అయితే, నేరుగా కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఉద్దేశించి కపిల్ సిబాల్ వ్యాఖ్యలు చేయడం ఆ పార్టీ శ్రేణులకు ఆగ్రహం కలిగించింది. కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ఇంటి ముందు ఆందోళన చేపట్టమే కాకుండా, ఇంటిపై టమోటాలు విసిరారు. కారును ధ్వంసం చేశారు.
దీనిపై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. "కాంగ్రెస్ పార్టీ యజమాని రాహుల్ గాంధీ ఎల్లవేళలా వాక్ స్వాతంత్ర్యం గురించి మాట్లాడుతుంటారు. కానీ ఆయన సొంత పార్టీ కార్యకర్తలే సీనియర్ నేత కపిల్ సిబాల్ పై దాడి చేశారు. కపిల్ సిబాల్ భావవ్యక్తీకరణ స్వేచ్ఛను ఉపయోగించుకున్నందుకే ఈ దాడి చేశారు. పార్టీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవడం అటుంచితే, కనీసం రాహుల్ ఈ దాడి ఘటనను కూడా ఖండించలేదు" అని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు.