Congress: పాపం.. ఈ అమరీందర్ సింగ్ ను 'ఫుట్ బాల్' ఆడేస్తున్నారు!

Footballer Amarinder Singh asks people not to tag him for former punjab CM

  • భారత ఫుట్‌బాల్ జట్టు గోల్ కీపర్ పేరు కూడా అమరీందర్ సింగ్
  • మాజీ సీఎం అనుకొని అతన్ని ట్యాగ్ చేస్తున్న నెటిజన్లు
  • తనను ట్యాగ్ చేయొద్దంటూ అభ్యర్థించిన క్రీడాకారుడు

పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు వేడెక్కాయి. అయితే ఈ రాజకీయాలు ఒక క్రీడాకారుడికి విసుగు తెప్పిస్తున్నాయి. ఎందుకంటే పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ అనుకొని ఈ ఫుట్‌బాల్ ప్లేయర్‌ను అందరూ విసిగిస్తున్నారు మరి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భారత ఫుట్‌బాల్ జట్టు గోల్‌కీపర్ పేరు కూడా అమరీందర్ సింగ్. దీంతో చాలామంది జర్నలిస్టులు, నెటిజన్లు సోషల్ మీడియాలో చేసే పోస్టులకు పొరపాటున ఇతన్ని ట్యాగ్ చేస్తున్నారు.

దీంతో విసుగు చెందిన ఫుట్‌బాలర్ అమరీందర్.. మీడియా సంస్థలను, వ్యక్తులను ఉద్దేశిస్తూ ట్విట్టర్ వేదికగా ఒక ప్రకటన చేశాడు. పంజాబ్ మాజీ సీఎం బదులు తనను ట్యాగ్ చేయడం మానుకోవాలని కోరాడు. సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత కెప్టెన్ అమరీందర్ సింగ్ ఏం చేయబోతున్నారా? అని అందరూ చర్చించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే వీటిలో చాలా ప్రశ్నలు కెప్టెన్‌ అమరీందర్‌కు బదులు గోల్‌కీపర్‌ అమరీందర్‌కు వెళ్తున్నాయి. దీనిపై స్పందించిన ఫుట్‌బాలర్, ‘‘డియర్ మీడియా, జర్నలిస్టులు, నేను అమరీందర్ సింగ్. భారత ఫుట్‌బాల్ జట్టు గోల్ కీపర్‌ను, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రిని కాదు. దయచేసి నన్ను ట్యాగ్ చేయడం ఆపండి’’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ విషయం తెలిసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ దీనిపై స్పందించారు. ‘‘నీ బాధ అర్థం చేసుకోగలను. నువ్వు ఆడబోయే ఆటలకు గుడ్ లక్’’ అంటూ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News