China: కరోనా సోకిన పెంపుడు పిల్లులను చంపేసిన చైనా అధికారులు
- చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
- మహమ్మారిని కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్న చైనా
- జంతువులకు చికిత్స లేదంటూ పిల్లులను చంపేసిన వైనం
కరోనా వైరస్ సోకిన మూడు పెంపుడు పిల్లులను చైనా చంపేసింది. హర్బిన్ సిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సిటీలో కొత్తగా 75 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఒక వ్యక్తికి కరోనా సోకినట్టు సెప్టెంబర్ 21న గుర్తించారు. ప్రస్తుతం అతను ఐసొలేషన్ లో ఉన్నాడు.
అయితే అతని పెంపుడు పిల్లులకు కూడా టెస్టులు చేయించగా... వాటికి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో, ఆ మూడు పిల్లులను ప్రభుత్వ అధికారులు చంపేశారు. జంతువులకు కరోనా చికిత్స లేకపోవడం వల్లే వాటిని చంపేశామని అధికారులు తెలిపారు.
మరోపక్క, చైనాలో పలు ప్రాంతాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసులను కట్టడి చేసేందుకు చైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఒకరిద్దరికి పాజిటివ్ వచ్చినా... వారితో కాంటాక్టులోకి వచ్చిన అందరికీ టెస్టులు చేయిస్తున్నారు.