USA: అమెరికా డ్రోన్ దాడుల్లో అల్ ఖైదా కీలక నేత హతం
- సిరియాలో అమెరికా దాడులు
- వాహనంలో వెళుతున్న అల్ ఖైదా నేత సలీమ్ అబు అహ్మద్
- గురిచూసి కొట్టిన అమెరికా దళాలు
- అబు అహ్మద్ మృతిని నిర్ధారించిన పెంటగాన్
సిరియాలో అల్ ఖైదాపై అమెరికా జరిపిన దాడుల్లో ఓ అగ్రనేత హతమయ్యాడు. సెప్టెంబరు 20న ఇద్లిబ్ ప్రావిన్స్ లో అమెరికా డ్రోన్ ల సాయంతో దాడులు చేపట్టింది. ఈ దాడిలో అల్ ఖైదా నేత సలీమ్ అబు అహ్మద్ మరణించాడు. అబు అహ్మద్ హతుడైన విషయాన్ని పెంటగాన్ వర్గాలు నిర్ధారించాయి.
ఈ దాడిలో సాధారణ పౌరులు ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని అమెరికా రక్షణ శాఖ స్పష్టం చేసింది. ఇటీవల ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో జరిగిన అమెరికా డ్రోన్ దాడిలో ఏడుగురు చిన్నారుల సహా 10 మంది పౌరులు చనిపోయిన నేపథ్యంలో, సిరియాలో ఎంతో కచ్చితత్వంతో దాడులు జరిపినట్టు అర్థమవుతోంది.
ఇద్లిబ్ ప్రావిన్స్ లో అమెరికా దళాలు దాడులు చేసినట్టు తెలిసినా, ఆ దాడులు ఎవరిని లక్ష్యంగా చేసుకుని జరిపారో నిన్నటివరకు స్పష్టత లేదు. తాజాగా అమెరికా ప్రకటనతో అల్ ఖైదా నేత అబు అహ్మద్ ఈ దాడుల్లో మృతి చెందినట్టు వెల్లడైంది. తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న ప్రాంతంలో ఓ వాహనంలో అబు అహ్మద్ వెళుతున్నట్టు గుర్తించిన అమెరికా... అత్యాధునిక డ్రోన్ ల సాయంతో అతడిని మట్టుబెట్టింది. అల్ ఖైదాలో కీలక నేతగా ఉన్న అబు అహ్మద్ ప్రణాళికలు రచించడంలో దిట్టగా భావిస్తున్నారు.
నిధుల సమీకరణ, ఎక్కడికక్కడ అల్ ఖైదా దాడులకు అనుమతులు ఇవ్వడం తదితర బాధ్యతలను అతడు నిర్వర్తిస్తున్నట్టు అమెరికా ఆర్మీ మేజర్ జనరల్ జాన్ రిగ్స్ బీ వెల్లడించారు. అమెరికా భూభాగంపై దాడులు జరపాలని భావించే అంతర్జాతీయ ఉగ్రవాద వ్యవస్థలను ఎక్కడున్నా ధ్వంసం చేస్తామని, ఇకపైనా తమ దాడులు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.