Elon Musk: భారత్ లో ఎలాన్ మస్క్ కొత్త వ్యాపారం... వివరాలు ఇవిగో!
- వ్యాపార విస్తరణకు మస్క్ నిర్ణయం
- భారత్ లో బ్రాడ్ బ్యాండ్ సేవలు
- స్టార్ లింక్ సంస్థ ద్వారా ఇంటర్నెట్
- వచ్చే ఏడాది డిసెంబరు నాటికి సేవలు
టెక్, విద్యుత్ వాహనాల వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ అంతరిక్ష పరిశోధనలు, బ్రాడ్ బ్యాండ్ వ్యాపార రంగంలోనూ భారీగా పెట్టుబడులు కలిగి ఉన్నారు. టెస్లా పేరిట ఎలక్ట్రిక్ వాహన వ్యాపారాన్ని ప్రపంచవ్యాప్తం చేసేందుకు ప్రణాళికలు చేపడుతున్న మస్క్... స్టార్ లింక్ పేరిట చేపడుతున్న బ్రాడ్ బ్యాండ్ వ్యాపారాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే భారత్ లోనూ స్టార్ లింక్ బ్రాడ్ బ్యాండ్ సేవలు అందించేందుకు సన్నద్ధమవుతున్నారు. అన్నీ కుదిరితే 2022 డిసెంబరు నుంచి భారత్ లో ఇంటర్నెట్ సేవలు అందించాలన్నది మస్క్ ప్రణాళిక.
భారత కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం వేచిచూస్తున్నట్టు స్టార్ లింక్ భారత విభాగం డైరెక్టర్ సంజయ్ భార్గవ తెలిపారు. ఇప్పటికే 5 వేలకు పైగా ప్రీబుకింగ్ లు నమోదయ్యాయని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ బ్రాండ్ బ్యాండ్ సేవలు అందించడంపై ఆసక్తిగా ఉన్నామని పేర్కొన్నారు.
వచ్చే ఏడాది డిసెంబరు నాటికి దేశంలో 2 లక్షల క్రియాశీలక టెర్మినళ్లను కలిగి ఉండడం తమ ప్రణాళికల్లో ముఖ్యమైన అంశమని తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి రానందున ఇప్పటివరకు ఒక్క టెర్మినల్ కూడా లేదని సంజయ్ భార్గవ వెల్లడించారు.