Delhi Capitals: బలమైన ముంబయిని స్వల్పస్కోరుకు కట్టడి చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
- షార్జాలో ముంబయి వర్సెస్ ఢిల్లీ
- మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి
- 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 రన్స్
- సూర్యకుమార్ యాదవ్ 33 పరుగులు
- చెరో మూడు వికెట్లు తీసిన ఆవేశ్ ఖాన్, అక్షర్
ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు అమోఘంగా రాణించారు. షార్జా మైదానంలో జరుగుతున్న ఈ ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో టాస్ ఓడిన ముంబయి మొదట బ్యాటింగ్ చేసింది. అయితే ఢిల్లీ బౌలర్లు వ్యూహాత్మకంగా బౌలింగ్ చేసి ముంబయి బ్యాటింగ్ లైనప్ ను కకావికలం చేశారు. దాంతో ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులు మాత్రమే చేయగలిగింది.
33 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ జట్టులో టాప్ స్కోరర్. ఆఖర్లో జయవంత్ యాదవ్ 4 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్ తో 11 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో ఆవేశ్ ఖాన్, అక్షర్ పటేల్ చెరో 3 వికెట్లు తీసి ముంబయిని దెబ్బకొట్టారు.
అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో ఢిల్లీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 8 పరుగులు చేసిన ఓపెనర్ శిఖర్ ధావన్ రనౌట్ అయ్యాడు. దాంతో ఢిల్లీ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఆపై మరో ఓపెనర్ పృథ్వీ షాను కృనాల్ పాండ్య ఎల్బీడబ్ల్యూ చేయడంతో ఢిల్లీ మరో వికెట్ చేజార్చుకుంది. ప్రస్తుతం ఆ జట్టు స్కోరు 3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 21 పరుగులు.