Taliban: తాలిబన్ల మరో అరాచకం.. సరిహద్దుల్లో సూసైడ్ స్పెషల్ బెటాలియన్ ఏర్పాటు!

Taliban To Deploy Suicide Bombers At Afghanistan Borders
  • సూసైడ్ స్పెషల్ బెటాలియన్‌కు మన్సూరి ఆర్మీగా నామకరణం
  • బదఖ్షన్ సహా దేశ సరిహద్దుల్లో మోహరింపు
  • ఈ బెటాలియన్ లేకుంటే అమెరికాపై విజయం సాధ్యమయ్యేది కాదన్న తాలిబన్లు
ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు మరో అరాచకానికి తెరలేపారు. దేశ సరిహద్దుల్లో ఆత్మాహుతి దళాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. మరీ ముఖ్యంగా తజకిస్థాన్, చైనాతో సరిహద్దులు పంచుకుంటున్న బదఖ్షన్ ప్రావిన్స్‌లో ఈ ప్రత్యేక సూసైడ్ స్పెషల్ బెటాలియన్‌ను మోహరిస్తున్నట్టు తెలిపారు. ఈ బెటాలియన్ సాధారణ ఆత్మాహుతి దళాలను పోలి ఉంటుందని బదఖ్షన్ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ ముల్లా నిసార్ అహ్మద్ అహ్మది పేర్కొన్నారు. దీనిని లష్కర్- మన్సూరి (మన్సూరి ఆర్మీ)గా పిలుస్తారు. దేశ సరిహద్దుల్లో ఈ బెటాలియన్‌ను మోహరిస్తామని చెప్పారు.  

నిజానికి ఈ బెటాలియన్ కనుక లేకపోయి ఉంటే అమెరికాపై తాము విజయం సాధించి ఉండేవాళ్లమే కాదని డిప్యూటీ గవర్నర్ తెలిపారు. అత్యంత ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తులు ఈ బెటాలియన్‌లో ఉంటారని, అల్లా కోసం వారు తమను తాము అర్పించుకునేందుకు సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు. కాగా, తాలిబన్లకు మన్సూరి ఆర్మీతో పాటు ‘బద్రి 313’ బెటాలియన్ కూడా ఉంది. ఇది కూడా ఆత్మాహుతి స్క్వాడే. కాబూల్ విమానాశ్రయంలో మోహరించిన మిలటరీ గ్రూపుల్లో ఇది కూడా ఒకటి.
Taliban
Afghanistan
Suicide Bombers

More Telugu News