Pakistan: భారత భూభాగంలోకి డ్రోనును పంపి ఆయుధాలు జారవిడిచిన పాక్!
- జమ్మూకశ్మీర్‌లో మళ్లీ డ్రోను కలకలం
- ఏకే-47 తుపాకి, మూడు మ్యాగజైన్లు, 30 బుల్లెట్లు, ఓ టెలిస్కోప్ స్వాధీనం
- దర్యాప్తు జరుపుతోన్న పోలీసులు
పాకిస్థాన్ మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడింది. జమ్మూకశ్మీర్‌లోకి మళ్లీ డ్రోనును పంపి కలకలం రేపింది. అంతర్జాతీయ సరిహద్దుకు ఆరు కిలో మీటర్ల దూరంలో ఉన్న సోహంజనా ప్రాంతంలో గత రాత్రి శబ్దం రావడాన్ని గుర్తించిన ఓ స్థానికుడు బయటకు వెళ్లిచూడగా ఓ డ్రోన్ పలు వస్తువులను జారవిడుస్తూ కనపడింది. అనంతరం ఆ డ్రోన్ పాకిస్థాన్ వైపునకు తిరిగి వెళ్లింది.
ఈ విషయాన్ని ఆ స్థానికుడు వెంటనే పోలీసులకు చెప్పాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పాక్ నుంచి వచ్చిన ఓ డ్రోన్ భారత సరిహద్దుల్లో ఆయుధాలు జారవిడిచినట్లు తేల్చారు. దీంతో ఆ ప్రాంతమంతా గాలించగా ఓ ప్యాకెట్లో ఏకే-47 తుపాకి, మూడు మ్యాగజైన్లు, 30 బుల్లెట్లు, ఓ టెలిస్కోప్ ఉన్నాయి.
ఈ ఆయుధాలను పాక్ జమ్మూకశ్మీర్‌లోని ఎవరికి పంపిందన్న విషయంపై దర్యాప్తు జరుపుతున్నారు. కొన్ని నెలల క్రితం కూడా పాక్ నుంచి వచ్చిన డ్రోన్లు కలకలం రేపిన విషయం తెలిసిందే. చాలా కాలంగా భారత్‌లోకి పాక్ డ్రోన్ల సాయంతో ఆయుధాలు పంపుతోంది.