Mamata Banerjee: ఎట్టకేలకు విక్టరీ... భవానీపూర్ లో మమతా బెనర్జీనే విజేత
- గత అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓటమి
- అయినప్పటికీ సీఎం పదవి చేపట్టిన వైనం
- ఆర్నెల్ల లోపు గెలిచి తీరాల్సిన పరిస్థితి
- భవానీపూర్ నుంచి పోటీ
- 58 వేల పైచిలుకు ఓట్లతో బీజేపీ అభ్యర్థిపై విజయం
సీఎంగా కొనసాగాలంటే తప్పక నెగ్గాల్సిన స్థితిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజయం సాధించారు. భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో మమతా బెనర్జీ 58,389 ఓట్ల ఆధిక్యంతో జయకేతనం ఎగురవేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ లో అవమానకర రీతిలో పరాజయం చవిచూసిన మమతా బెనర్జీ ఎట్టకేలకు గెలిచి సీఎం పీఠం నిలుపుకున్నారు.
భవానీపూర్ ఉప ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి, బీజేపీ మహిళా నేత ప్రియాంకా టిబ్రేవాల్ ను దీదీ ఓడించారు. సెప్టెంబరు 30న పోలింగ్ నిర్వహించగా, నేడు ఓట్ల లెక్కింపు చేపట్టారు. మమతా విజయంతో పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా టీఎంసీ శ్రేణుల్లో సందడి వాతావరణం నెలకొంది.
వాస్తవానికి భవానీపూర్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీఎంసీకే చెందిన శోభన్ దేబ్ ఛటోపాధ్యాయ్ గెలుపొందారు. కానీ మమతా బెనర్జీ నందిగ్రామ్ లో ఓడిపోయినా సీఎం పీఠం ఎక్కారు. ఆర్నెల్లలోపు ఆమె గెలవకపోతే సీఎంగా తప్పుకోవాల్సి ఉంటుందన్న నేపథ్యంలో, శోభన్ దేబ్ భవానీపూర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, తన నియోజకవర్గంలో సీఎం మమతా బెనర్జీ పోటీచేసేందుకు మార్గం సుగమం చేశారు.
నందిగ్రామ్ లో సువేందు అధికారి చేతిలో పరాజయాన్ని మరిపించేలా దీదీని గెలిపించాలని టీఎంసీ శ్రేణులు భవానీపూర్ లో తీవ్రస్థాయిలో ప్రచారం చేసి అనుకున్న ఫలితాన్ని రాబట్టాయి. ఓట్ల లెక్కింపు సందర్భంగా రెండో రౌండుకే మమతా ఆధిక్యం 50 వేలకు దాటడంతో గెలుపు ఖరారైంది.