Chittoor District: ఏపీలో మతమార్పిడులను ప్రోత్సహిస్తున్నారు: వీహెచ్‌పీ జాతీయ ప్రధాన కార్యదర్శి పరాండే
- పేరూరులో ముగిసిన భజరంగ్‌దళ్ అఖిలభారత సమావేశం
- స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైనా హిందువులకు స్వేచ్ఛ లేదు
- ఈ నెల 17 నుంచి 24 వరకు జాతీయ గ్రామీణ జాగరణ్
దేశంలోని హిందువులకు స్వేచ్ఛ కరవైందని విశ్వహిందూ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శి పరాండే ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి మండలంలోని పేరూరు హరిపురం కాలనీలో ఉన్న దక్షిణ శ్రీనాథ్‌ధామ్‌లో శ్రీబాలజీ భగవాన్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించిన భజరంగ్ దళ్ అఖిలభారత సమావేశం నిన్న ముగిసింది.
ఈ సమావేశంలో పాల్గొన్న పరాండే మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 65 ఏళ్లు గడుస్తున్నా దేశంలోని హిందువులకు సరైన స్వేచ్ఛ లభించడం లేదన్నారు. రాష్ట్రంలో మతమార్పిడులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 17 నుంచి 24 వరకు జాతీయ గ్రామీణ జాగరణ్ను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా గోసంరక్షణ, గోమాంసం విక్రయ నిషేధంపై దేశ ప్రజలకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ నేతలు పాల్గొన్నారు.