Prakash Raj: కరోనా వేళ చిరంజీవి ఎంతో సేవ చేశారు... మంచు కుటుంబం ఏంచేసింది?: ప్రకాశ్ రాజ్ సూటి ప్రశ్న
- 'మా' ఎన్నికల ప్రచారంలో పరస్పర విమర్శలు
- మంచు ఫ్యామిలీపై ప్రకాశ్ రాజ్ ధ్వజం
- మోహన్ బాబుపై ఆరోపణలు
- గెలిచిన తర్వాత తొలి ఫోన్ మంచు విష్ణుకేనని వెల్లడి
'మా' ఎన్నికల్లో పోటీ చేస్తున్న నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొన్ని కుటుంబాలకే పెత్తనం కావాలని మోహన్ బాబు అంటున్నారని... ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి కుటుంబాల్లో పుట్టకపోవడం నా తప్పా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మా' సభ్యుడిగా నాకు పోటీ చేసే హక్కు లేదా? అని ప్రశ్నించారు. 'మా' నాయకత్వం కొన్ని కుటుంబాలకే దక్కాలా? అని నిలదీశారు. తనకు ఇక్కడే ఇల్లు ఉందని, ఆధార్ కార్డు కూడా ఉందని ప్రకాశ్ రాజ్ వెల్లడించారు.
కరోనా సంక్షోభం సమయంలో చిరంజీవి ఎంతో సేవ చేశారని, కరోనా సమయంలో మంచు కుటుంబం ఏంచేసిందని ప్రకాశ్ రాజ్ సూటిగా ప్రశ్నించారు. క్రమశిక్షణ ఆ కుటుంబానికే ఉందంటున్నారు... ఏం, మేమందరం రోడ్లపై పుట్టామా? మాకు లేదా క్రమశిక్షణ? అంటూ వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు ఇప్పటికీ, ఎప్పటికీ చిరు అన్నయ్యేనని ఉద్ఘాటించారు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్... సినీ పరిశ్రమకు ఆస్తులు అని అభివర్ణించారు. పవన్ కల్యాణ్... సినీ పరిశ్రమకు పెద్ద నిధి అని కొనియాడారు.
మా ఎన్నికల నేపథ్యంలో నా పాత వివాదాలను ఇప్పుడు తెరపైకి తెస్తున్నారు... వివాదాలు సమసిపోయినా, ఇప్పుడు వాటిని ప్రస్తావించడం ఎందుకు? అంటూ ప్రకాశ్ రాజ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల 10న 'మా' ఎన్నికల్లో గెలిచాక మొదటి ఫోన్ మంచు విష్ణుకే చేస్తానని తెలిపారు. 'మా' భవన నిర్మాణానికి విష్ణు సాయం కూడా తీసుకుంటా అని వెల్లడించారు.