KCR: ఆ విషయంలో మోదీతో గొడవపెట్టుకున్నా: కేసీఆర్
- పద్మశ్రీ పురస్కారం విషయంలో మోదీ, అమిత్ షాను ప్రశ్నించా
- ఎందుకో కానీ తెలంగాణ విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది
- శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో కేసీఆర్ ఆవేదన
పద్మశ్రీ పురస్కారాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఈ విషయమై ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పలుమార్లు గొడవ పెట్టుకున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో భాగంగా నిన్న ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
ఎందుకో తెలియదు కానీ, తెలంగాణ విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణలో అద్భుతమైన వారసత్వ సంపద, పురాతన కట్టడాలు, జలపాతాలు ఉన్నప్పటికీ పర్యాటకం సహా పలు విషయాల్లో తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పద్మ పురస్కారాల విషయంలోనూ తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. పద్మశ్రీ పురస్కారాలకు పేర్లను పంపాలా? వద్దా? అని ప్రధాని మోదీ, అమిత్ షాను అడిగానని, తెలంగాణలో పద్మ పురస్కారాలు అందుకోవడానికి అర్హులైన కళాకారులే లేరా? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించానని కేసీఆర్ తెలిపారు.