Congress: లఖింపూర్ ఖేరి ఘటన.. రైతులపైకి కారు ఎక్కిస్తున్న వీడియోలు ఇవిగో
- ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ప్రియాంకగాంధీ
- కారు ఎక్కించిన వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్న
- మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీ
లఖింపూర్ ఖేరి ఘటనపై సర్వత్రా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. నిరసన తెలుపుతున్న రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడి కార్ల కాన్వాయ్ దూసుకెళ్లి నలుగురు రైతులు మరణించారు. దీంతో ఆగ్రహానికి గురైన రైతులు.. మరో కార్ లోని వారిని బయటకు లాగి కర్రలతో దాడి చేయడంతో కారు డ్రైవర్, ముగ్గురు బీజేపీ కార్యకర్తలు మరణించారు. దీనిపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇదిగో సాక్ష్యమంటూ రైతులపైకి కారు ఎక్కించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వీడియోను కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఎలాంటి ఎఫ్ఐఆర్, ఆదేశాలు లేకుండా తనను 28 గంటలుగా నిర్బంధించారని, మరి, రైతులపైకి కారు ఎక్కించిన వ్యక్తిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు మోదీజీ? అని ప్రశ్నించారు.
ఇక ఈ విషయంలో ప్రియాంకకు ఆమె సోదురుడు రాహుల్ కూడా మద్దతుగా నిలిచారు. ‘‘మీరు నిర్బంధించిన వ్యక్తి ఎవరికీ భయపడదు. నిజమైన కాంగ్రెస్ వాదులు ఓటమిని ఒప్పుకోరు.. ఈ సత్యాగ్రహం ఆగదు’’ అని ట్వీట్ చేశారు.