Uttar Pradesh: రేపటిలోగా ప్రియాంకను విడుదల చేయండి: యూపీ పోలీసులకు సిద్ధూ వార్నింగ్
- పరామర్శించడానికి వెళ్లిన నేతను అరెస్టు చేశారని ఆరోపణ
- కేంద్ర మంత్రి తనయుడిని అరెస్టు చేయాలని డిమాండ్
- విడుదల చేయకపోతే పంజాబ్ నుంచి లఖింపూర్ వరకూ మార్చ్
కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీని యూపీ పోలీసులు నిర్బంధంలో ఉంచడంపై పంజాబ్ కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ఆమెను బంధించడం సరికాదని విమర్శించారు. రేపు అంటే బుధవారంలోగా తమ పార్టీ నేతను విడుదల చేయాలని సిద్ధూ డిమాండ్ చేశారు.
‘‘రైతుల మరణాలకు కారణమైన కేంద్ర మంత్రి తనయుడిని వెంటనే అరెస్టు చేయాలి. రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంక గాంధీని వెంటనే విడుదల చేయాలి. లేదంటే పంజాబ్ నుంచి లఖింపూర్ వరకూ మార్చ్ నిర్వహిస్తాం’’ అని యూపీ పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటనలో లఖింపూర్‌లో హింసాకాండ జరిగిన సంగతి తెలిసిందే.
కేంద్ర మంత్రి తనయుడికి చెందిన కారు నిరసన చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లింది. ఆ తర్వాత జరిగిన హింసాకాండలో మొత్తం 8 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ క్రమంలో బాధిత రైతు కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన పలువురు నేతలను పోలీసులు అడ్డుకున్నారు. సీతాపూర్ వద్ద ప్రియాంకను అడ్డుకున్న పోలీసులు సమీపంలోని ఒక గెస్ట్‌హౌస్‌లో ఆమెను నిర్బంధించారు.