Ramayan: టీవీ ‘రావణాసురుడు’ అరవింద్ త్రివేది కన్నుమూత
- 1980 దశకంలో దూరదర్శన్‌లో రామాయణ్ ధారావాహిక
- రావణుడిగా మెప్పించి ప్రజల మనసుల్లో నిలిచిపోయిన అరవింద్
- గతరాత్రి గుండెపోటుతో మరణం
- మాటలు రావడం లేదన్న సహనటుడు సుశీల్ లహరి
1980వ దశకంలో దూరదర్శన్‌లో చిన్నా పెద్ద అందరినీ అలరించిన ‘రామాయణ్’ ధారావాహికలో రావణుడిగా నటించిన అరవింద్ త్రివేది కన్నుమూశారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. హార్ట్ ఎటాక్‌తో గత రాత్రి ఆయన మరణించారు. త్రివేది మరణవార్తను ఆయన సహ నటుడు సుశీల్ లహిరి ఈ తెల్లవారుజామున ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.
ఇది విచారకరమైన వార్త అని, తమ ప్రియమైన అరవింద్ భాయ్ ఇక లేరని ఆ పోస్టులో ఆయన పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. తన మార్గదర్శి, తన మేలు కోరేవారు, జెంటిల్‌మన్‌ను కోల్పోయినందుకు మాటలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అరవింద్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కనీసం నడవలేని స్థితిలో ఉన్నారు. గత మూడేళ్లుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని అరవింద్ మేనల్లుడు కౌస్తుబ్ త్రివేది తెలిపారు. గత రాత్రి 9.30 గంటల సమయంలో ఆయనకు గుండెనొప్పి వచ్చినట్టు చెప్పారు. ముంబైలోని తన నివాసంలోనే ఆయన తుదిశ్వాస విడిచినట్టు పేర్కొన్నారు.
అరవింద్ తన 40 ఏళ్ల సుదీర్ఘ కెరియర్లో హిందీ, గుజరాతీ సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించారు. దాదాపు 300 సినిమాల్లో నటించారు. 1991 నుంచి 96 వరకు సబర్కథ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు.