Tollywood: పవన్ వ్యాఖ్యలని వెనకేసుకొచ్చిన నాగబాబు

Nagababu Comments On Pawan Speech In Republic Event

  • ఏకీభవిస్తున్నానన్న మెగా బ్రదర్
  • తమ అన్నయ్య ఏం చెప్పినా చేస్తామన్న నాగబాబు
  • పోసాని గురించి మాట్లాడి నోరు పాడు చేసుకోనని కామెంట్
  • సీవీఎల్ నర్సింహారావు వ్యాఖ్యలపై మండిపాటు

ఎల్లుండే ‘మా’ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రచార జోరు మరింత వేడెక్కింది. నిన్ననే మంచు విష్ణు ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు మద్దతు తెలిపిన నాగబాబు.. వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ‘మా’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పోసాని మురళీ కృష్ణ, సీవీఎల్ నర్సింహా రావు వ్యాఖ్యలపై స్పందించారు. ఇటీవల రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపైనా మాట్లాడారు.

తన తమ్ముడిని ఆయన వెనకేసుకొచ్చారు. మెగా ఫ్యామిలీ అంతా ఎప్పుడూ ఒకే మాటపై ఉంటుందని ఆయన చెప్పారు. కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యలు మినహాయిస్తే.. సినీ ఇండస్ట్రీ మేలు కోసమే పవన్ వ్యాఖ్యలు చేశారన్నారు. తమ్ముడు చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానని ఆయన తేల్చి చెప్పారు. అలాగే తమ అన్నయ్య ఏం చెప్పినా చేస్తామన్నారు. పవన్ వ్యాఖ్యలకు అన్నయ్య విచారం వ్యక్తం చేశారని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారని, కానీ, అన్నయ్య ఆ మాటలను ప్రత్యక్షంగా చెప్పలేదు కదా? అని ప్రశ్నించారు.

ఇక, పోసాని కాంట్రవర్సీపైనా ఆయన మాట్లాడారు. పోసాని గురించి మాట్లాడి నోరు పారేసుకోలేనని అన్నారు. ప్రకాశ్ రాజ్ కు ఓటు వేయొద్దన్న సీవీఎల్ నర్సింహారావు వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఓటేయొద్దంటూ ఎలా చెబుతారని ప్రశ్నించారు. బీజేపీ నేతలు ప్రకాశ్ రాజ్ గెలవకూడదనుకుంటున్నారని, ఈ ఎన్నికల్లో రాజకీయాలను తీసుకురావడం మంచిది కాదని అన్నారు. బీజేపీ, ఆరెస్సెస్ అంటే తనకు గౌరవం ఉందని, వారు అసోసియేషన్ ఎన్నికల్లో జోక్యం చేసుకోరని చెప్పారు. ప్రకాశ్ రాజ్ ను దేశద్రోహి అనడం బాగాలేదన్నారు. ఆయన కూడా ఈ దేశంలోనే పుట్టారన్నారు.

  • Loading...

More Telugu News