Airindia: రూ.18 వేల కోట్లకు ఎయిరిండియాను సొంతం చేసుకున్న టాటా సన్స్
- టాటాల గూటికి ఎయిరిండియా
- అర్ధశతాబ్దం తర్వాత పుట్టింటికి చేరిన వైనం
- కొన్నేళ్లుగా అప్పుల ఊబిలో ఎయిరిండియా
- బిడ్డింగ్ చేపట్టిన కేంద్రం
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను కేంద్రం అమ్మకానికి పెట్టగా, టాటా గ్రూపునకు చెందిన టాటా సన్స్ బిడ్డింగ్ లో విజేతగా నిలిచింది. ఎయిరిండియాను రూ.18 వేల కోట్లకు దక్కించుకుంది. ఒకప్పుడు టాటాలే స్థాపించిన ఎయిరిండియా, అర్ధశతాబ్దం తర్వాత మళ్లీ సొంతగూటికి చేరినట్టయింది.
టాటా సన్స్ తన బిడ్డింగ్ ద్వారా ఎయిరిండియాను మాత్రమే కాకుండా, ఈ సంస్థకు చెందిన తక్కువ ధరల విభాగం ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ ను కూడా దక్కించుకుంది. అంతేకాదు, ఎయిరిండియా ఎయిర్ పోర్ట్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లోనూ 50 శాతం వాటాదారుగా అవతరించింది.
అప్పుల ఊబిలో చిక్కుకున్న ఎయిరిండియాను విక్రయించేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించగా, టాటా సన్స్ తన ప్రత్యేక ప్రయోజన వాహక సంస్థ టాలిస్ ప్రైవేట్ లిమిటెడ్ ను రంగంలోకి దింపింది. టాలిస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట బిడ్డింగ్ లో పాల్గొని విజేతగా నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (డీఐపీఏఎమ్) కార్యదర్శి తుహిన కాంత పాండే ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.