Rahul Dravid: ఉత్కంఠకు తెర.. టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రావిడ్
- 2023 ప్రపంచకప్ వరకు కోచ్ గా ద్రావిడ్
- బౌలింగ్ కోచ్ గా పరాస్ మాంబ్రే
- ద్రావిడ్ ను ఒప్పించిన గంగూలీ, జై షా
టీమిండియా తదుపరి కోచ్ ఎవరనే ఉత్కంఠకు తెర పడింది. భారత దిగ్గజ బ్యాట్స్ మెన్, మిస్టర్ వాల్ రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్ గా బాధ్యతలను స్వీకరించనున్నారు. ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి పదవీకాలం టీ20 ప్రపంచకప్ తో ముగియనుంది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ తర్వాత హెడ్ కోచ్ గా ద్రావిడ్ బాధ్యతలను స్వీకరించనున్నారు. 2023 ప్రపంచకప్ వరకు ఈ బాధ్యతలను నిర్వహించనున్నారు.
ఇదే సమయంలో టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ పదవీకాలం కూడా ముగుస్తోంది. ఈయన స్థానంలో పరాస్ మాంబ్రే కొత్త బౌలింగ్ కోచ్ గా రానున్నారు. రాహుల్ ద్రావిడ్ ప్రస్తుతం ఎన్సీఏ డైరెక్టర్ గా ఉన్నారు. ఎన్సీఏలోనే పరాస్ మాంబ్రే కూడా బౌలింగ్ కోచ్ గా ఉన్నారు. త్వరలోనే వీరిద్దరూ వారి పదవులకు రాజీనామా చేయనున్నారు. ఈ వివరాలను బీసీసీఐ అధికారికంగా తెలియజేసింది.
మరోవైపు ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ స్థానంలో ఎవరిని తీసుకుంటున్నారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. వాస్తవానికి హెడ్ కోచ్ పదవిని స్వీకరించేందుకు ద్రావిడ్ ఆసక్తి చూపలేదు. అయితే, ఆయనను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జే షాలు ఒప్పించారని సమాచారం.