Andhra Pradesh: ఉత్తరాంధ్రలో కుమ్మేసిన వానలు.. విజయవాడలో జోరువాన
- తిరుపతిలో రెండు గంటలపాటు జోరు వాన
- శ్రీకాకుళం జిల్లా పలాసలో అత్యధికంగా 14 సెంటీమీటర్ల వర్షపాతం
- నేడు, రేపు కూడా వానలు కురిసే అవకాశం
ఉత్తరాంధ్రను వానలు వణికించాయి. శ్రీకాకుళం నుంచి కర్నూలు జిల్లా వరకు నిన్న ఎడతెరిపిలేని వానలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడితే మరికొన్ని చోట్ల కుండపోత వాన కురిసింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం, సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో తూర్పు పశ్చిమ ద్రోణి ప్రభావంతోనే ఈ వర్షాలు కురిశాయి. నేడు, రేపు కూడా కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న విజయవాడలో జోరున కురిసిన వానకు రోడ్లు జలమయం అయ్యాయి.
శుక్రవారం-శనివారం మధ్య శ్రీకాకుళం జిల్లా పలాసలో అత్యధికంగా 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఇచ్ఛాపురంలో 11, మందసలో 9, సోంపేటలో 8, టెక్కలిలో 8, కళింగపట్నంలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. నిన్న ఉదయం నుంచి రాత్రి మధ్య, తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో 11.4, కొత్తపల్లిలో 10.2, శ్రీకాకుళం జిల్లా మందసలో 8.7, రాజాంలో 7.6, టెక్కలిలో 6.8 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
అలాగే, తిరుపతిలోనూ నిన్న వర్షం దంచికొట్టింది. రెండు గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి నీరు చేరి ట్రాఫిక్ స్తంభించింది. కాలనీలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఉభయగోదావరి జిల్లాలు, విశాఖపట్టణం, విజయనగరం, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి.