Hyderabad: మరో మూడు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు!
- రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలకు అవకాశం
- నిన్న మధ్యాహ్నం ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం
- మరో 24 గంటల్లో బలహీన పడనున్న అల్పపీడనం
- 27న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం
రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. నిన్నటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాలు మరో మూడు రోజులపాటు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
నిన్న మధ్యాహ్నం వరకు రాష్ట్రంలో పొడిగా ఉన్న వాతావరణం ఆ తర్వాత ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. మరోవైపు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో బలహీనపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే, ఈ నెల 27న మరో అల్పపీడనం ఏర్పడి ఒడిశాలోని పూరి వద్ద తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.