Brahmam Chowdary: టీడీపీ నేత బ్రహ్మం చౌదరికి 14 రోజుల రిమాండ్.. గుంటూరు సబ్ జైలుకు తరలింపు
- తనను నిర్బంధించారంటూ బ్రహ్మం చౌదరిపై సీఐ నాయక్ ఫిర్యాదు
- ఈ కేసులో ఏ6గా బ్రహ్మం చౌదరి
- నిన్నంతా చౌదరిని వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పిన పోలీసులు
టీడీపీ యువ నేత బ్రహ్మం చౌదరికి 14 రోజుల రిమాండును మంగళగిరి కోర్టు విధించింది. కేసు వివరాల్లోకి వెళ్తే టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన రోజున అక్కడకు వెళ్లిన తనను నిర్బంధించారంటూ సీఐ నాయక్ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో బ్రహ్మం చౌదరి ఏ6గా ఉన్నారు. కేసులోని నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఈ క్రమంలో నిన్న టీడీపీ పిలుపునిచ్చిన ఏపీ బంద్ సందర్భంగా ఉండవల్లిలో బ్రహ్మం చౌదరి ఆందోళన చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్నంతా వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పారు. ఈరోజు ఉదయం మంగళగిరి పీఎస్ కు ఆయనను తీసుకొచ్చారు. అనంతరం మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టారు.
కోర్టు విచారణ సందర్భంగా పోలీసులు తనను దుర్భాషలాడారని, మేడికొండూరు సీఐ మారుతీ కృష్ణ తనను కొట్టారని న్యాయమూర్తికి బ్రహ్మం చౌదరి ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో, ఆయనను గుంటూరు సబ్ జైలుకు తరలించారు.