Bangladesh: టీ20 వరల్డ్ కప్ సూపర్-12లోకి దూసుకెళ్లిన బంగ్లాదేశ్
- గ్రూప్ మ్యాచ్ లో పాపువా న్యూ గినియా ఓటమి
- 84 పరుగుల భారీ తేడాతో నెగ్గిన బంగ్లాదేశ్
- షకీబ్ కు 4 వికెట్లు
- లక్ష్యఛేదనలో పాపువా 97 ఆలౌట్
యూఏఈ, ఒమన్ దేశాల్లో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ సూపర్-12లోకి ప్రవేశించింది. ఇవాళ జరిగిన గ్రూప్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు పసికూన పాపువా న్యూ గినియాపై 84 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 182 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన పాపువా జట్టును బంగ్లా బౌలర్లు 97 పరుగులకే కట్టడి చేశారు. ముఖ్యంగా షకీబ్ అల్ హసన్ లెఫ్టార్మ్ స్పిన్ ను ఆడడంలో పాపువా బ్యాట్స్ మెన్ తడబడ్డారు. షకీబ్ 4 ఓవర్లు వేసి 9 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.
పాపువా జట్టు 54 పరుగులకే 8 వికెట్లు కోల్పోయినా, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కిప్లిన్ డోరిగా దూకుడుగా ఆడాడు. డోరిగా 34 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. చాద్ సోపర్ 11 పరుగులు చేశాడు. వీరిద్దరు తప్ప పాపువా న్యూ గినియా జట్టులో మరెవ్వరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. బంగ్లా బౌలర్లలో మహ్మద్ సైఫుద్దీన్ 2, తస్కిన్ అహ్మద్ 2, మెహెదీ హసన్ 1 వికెట్ తీశారు.