Andhra Pradesh: డ్వాక్రా రుణం పొందిన మహిళల ఇళ్లకు జగన్ ఫొటోతో స్టిక్కర్లు
- దసరా సందర్భంగా రెండో విడత పొదుపు సొమ్మును జమ చేసిన ప్రభుత్వం
- వార్డుల్లో తిరుగుతూ లబ్ధిదారులను గుర్తిస్తున్న మెప్మా సీవోలు, ఆర్పీలు
- మహిళలను ఇళ్లముందు నిలబెట్టి ఫొటోలు
ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా లబ్ధిదారుల ఇళ్లకు ముఖ్యమంత్రి జగన్ ఫొటోతో ఉన్న స్టిక్కర్లు అతికిస్తూ లబ్ధిదారుల ఫొటోలు తీస్తున్నారు. ఇందులో భాగంగా రుణాలు పొందిన పొదుపు సంఘాలను గుర్తించేందుకు మెప్మా సీవోలు, ఆర్పీలు వార్డుల్లో పర్యటిస్తున్నారు. లబ్ధిదారుల జాబితా ఆధారంగా రుణాలు తీసుకున్న వారిని గుర్తించి వారి ఇళ్లకు స్టిక్కర్లు అతికిస్తున్నారు. లబ్ధిదారులను ఇంటిముందు నిలబెట్టి ఫొటోలు కూడా తీస్తున్నారు. ఆసరా పేరుతో ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు విడతల వారీగా పొదుపు సొమ్మును వారి ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసింది. దసరా సందర్భంగా ఇటీవల రెండో విడత సొమ్మును కూడా వారి ఖాతాల్లో జమ చేసింది. గుంటూరు జిల్లాలో ఈ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది.