India: రేపు భారత్-పాక్ మ్యాచ్.. చూసేందుకు హైదరాబాద్‌లో భారీ ఏర్పాట్లు
- హైదరాబాద్‌లోని రెస్టారెంట్లు, బార్లు, హోటళ్లలో పెద్ద తెరలతో ఏర్పాటు
- జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్ క్లబ్‌లలో ఇప్పటికే పూర్తి
- బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలిలోని పబ్‌లలోనూ ఏర్పాట్లు
- హెచ్‌సీయూలో విద్యార్థి సంఘాలు భారీ స్క్రీన్ల ఏర్పాటు
టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య రేపు మ్యాచ్ జరగనుంది. అసలు సిసలైన క్రికెట్ మజాను ఆస్వాదించేందుకు అభిమానులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రేపు ఆదివారం కావడంతో చాలా మంది మ్యాచ్ ను చూసే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వాణిజ్య సంస్థలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి.
హైదరాబాద్‌లోని రెస్టారెంట్లు, బార్లు, హోటళ్లలో పెద్ద తెరలపై క్రికెట్ ప్రసారం చేయనున్నారు. ఇందుకు సంబంధించి జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్ క్లబ్‌లలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే పలు పబ్‌లలోనూ ఏర్పాట్లు చేస్తున్నారు. హెచ్‌సీయూలో విద్యార్థి సంఘాలు భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశాయి.
మరోవైపు, టీ20 సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచులు తొలిసారి మల్టీప్లెక్స్‌ల్లో ప్రత్యక్ష ప్రసారం అయ్యే అవకాశం ఉంది. ప్రపంచ కప్ చివరి దశ మ్యాచ్‌లకల్లా ఇవి అందుబాటులోకి వస్తాయని మల్టీప్లెక్స్ సిబ్బంది తెలిపారు.