Revanth Reddy: సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ లూ అనామకులే: టీపీసీసీ చీఫ్ రేవంత్
- వారి నియోజకవర్గాలకు వారేమైనా స్థానికులా? అని ప్రశ్న
- బల్మూరి వెంకట్ స్థానికేతరుడన్న కేటీఆర్ కామెంట్లపై మండిపాటు
- పోలీస్ విభాగం విడిపోయిందని సంచలన ఆరోపణలు
- డీజీపీపైనా నిఘా పెట్టారని ఆరోపణ
తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ స్థానికేతరుడు అని కేటీఆర్ వ్యాఖ్యానించడంపై ఇవాళ కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ ఇతర మంత్రులూ వారి వారి నియోజకవర్గాలకు అనామకులేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అభ్యర్థిని నాన్ లోకల్ అంటున్నారని, మరి, గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటలో పోటీ చేసిన వారెలా స్థానికులవుతారని ప్రశ్నించారు. హుజూరాబాద్ ను టీఆర్ఎస్, బీజేపీలు వ్యసనాలకు అడ్డాగా మార్చాయన్నారు. పంపకాల్లో తేడా వల్లే హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చిందని ఆరోపించారు. దళితబంధు, పేదల ఇళ్ల కోసం ఈటల రాజీనామా చేయలేదని విమర్శించారు. సిద్దిపేటలో దళితబంధు ఇవ్వరా? అని ప్రశ్నించారు.
దుబ్బాక, హుజూర్ నగర్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని సీఎం కేసీఆర్ ను నిలదీశారు. జనాలను భయపెట్టి ఓట్లేయించుకునేందుకు హరీశ్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. త్వరలోనే టీఆర్ఎస్ లో ముసలం ఖాయమని, రాష్ట్రం కోసం కేసీఆర్ కుటుంబంలో ప్రాణ త్యాగాలు ఎవరూ చేయలేదని అన్నారు.
రాష్ట్రంలో పోలీస్ విభాగం రెండుగా విడిపోయిందని సంచలన ఆరోపణ చేశారు. ఉప ఎన్నికలో పోలీసులు నిజాయతీగా విధులు నిర్వర్తించడం లేదని, టీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. డీజీపీ ఫోన్ నూ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. డీజీపీపై నర్సింగరావు, తమపై వేణుగోపాలరావు నిఘా పెట్టారని చెప్పారు. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సామాజిక వర్గానికి చెందిన పోలీసులను వేధిస్తున్నారని రేవంత్ ఆరోపణలు చేశారు.