Electric Vehicles: ఈ ఎలక్ట్రిక్ కారును ఎంచక్కా మడతెట్టేసుకోవచ్చు.. త్వరలోనే మార్కెట్ లోకి!
- సిటీ ట్రాన్స్ ఫార్మర్ పేరిట డెన్మార్క్ కంపెనీ రూపకల్పన
- గంటకు 90 కిలోమీటర్ల వేగం
- ఒక్కసారి చార్జింగ్ పెడితే 180 కిలోమీటర్ల ప్రయాణం
ఓ వైపు కాలుష్యం.. మరో వైపు ట్రాఫిక్.. ఇంట్లో కారు పెట్టుకుందామన్నా చోటు లేదు.. వీటన్నింటికీ పరిష్కారమేంటి? మొదటి రెండింటికైతే విద్యుత్ కార్లు, ఎగిరే కార్ల రూపంలో ఓ పరిష్కారమైతే ఉందిగానీ.. మూడో దానికి మాత్రం ఇప్పటిదాకా కొత్త పరిష్కారం దొరకలేదు. దానికీ ఓ పరిష్కారముంటే ఎంత బాగుంటుందో కదా. కారుకు చోటు సమస్య లేకుండా ఎంచక్కా మంచంలా మడతెట్టేస్తే చాలా బాగుంటుంది కదా.
అలాంటి కారే ఇది. డెన్మార్క్ కు చెందిన ఓ కంపెనీ ‘సిటీ ట్రాన్స్ ఫార్మర్’ పేరిట ఈ కారుకు రూపకల్పన చేసింది. అయితే ఒకేఒక్క లోపమేంటంటే.. కేవలం ఒక్కరే ఇందులో ప్రయాణించాల్సి రావడం. అతి త్వరలోనే యూరప్ మార్కెట్ లోకి విడుదల కానున్న ఈ కారు గరిష్ఠంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. ఐదు సెకన్లలోనే 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. బ్యాటరీని చార్జ్ చేస్తే ఆగకుండా 180 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. కారు చాసిస్ ను మడతపెట్టే సౌలభ్యం కూడా ఉంది. దీంతో కేవలం 100 సెంటీ మీటర్ల వెడల్పులోనే కారును పార్క్ చేసుకోవచ్చు.