Graeme Swan: పాక్ ను అంచనా వేయలేం... నిన్న ఎలా గెలిచారో, అదే విధంగా ఓడిపోవడం వారికే సాధ్యం: ఇంగ్లండ్ క్రికెటర్ గ్రేమ్ స్వాన్
- టీ20 వరల్డ్ కప్ లో భారత్ పై పాక్ విజయం
- అభిప్రాయాలు వెల్లడించిన స్వాన్
- పాక్ నిజంగా డేంజరస్ జట్టు అంటూ వ్యాఖ్యలు
- ఈ ఓటమి టీమిండియాకు మేలు చేస్తుందని వెల్లడి
టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓడిపోవడం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ స్పందించాడు. పాక్ జట్టు గురించి మాట్లాడుతూ, ఆ జట్టు నిజంగా అనిశ్చితికి మారుపేరు వంటిదని అభిప్రాయపడ్డాడు. నిన్న భారత్ పై 10 వికెట్ల తేడాతో గెలిచిన పాక్, అదే రీతిలో ఓడిపోగలదని, ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని ప్రమాదకర టీమ్ అని పేర్కొన్నాడు. పాక్ ఇదే ఊపులో టోర్నమెంట్ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నాడు.
టీమిండియా పరిస్థితిపైనా స్వాన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఈ ఓటమి ఓ రకంగా టీమిండియాకు మేలు చేస్తుందని అన్నాడు. ఈ ప్రపంచకప్ టోర్నీలో టీమిండియాకు ఇది మొదటి మ్యాచ్ మాత్రమేనని, తప్పొప్పులను గుర్తించి సరిదిద్దుకునేందుకు ఈ ఓటమి మంచి అవకాశం కల్పిస్తుందని తెలిపాడు.
ఐపీఎల్ కారణంగా టీమిండియా ఆటగాళ్లు అలసిపోయి ఉంటారని వివరించాడు. టోర్నీ సాగేకొద్దీ టీమిండియా తప్పకుండా పుంజుకుంటుందని, టీమిండియానే టైటిల్ ఫేవరెట్ అని అందరూ అంటున్నారని స్వాన్ తెలిపాడు.
ఇక, భారత్ టీ20 వరల్డ్ కప్ సూపర్-12 దశలో తదుపరి మ్యాచ్ ను ఈ నెల 31న న్యూజిలాండ్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ కూడా దుబాయ్ లోనే జరగనుంది.