Anil Kumar Yadav: గత ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తే ఒక్క ప్రాజెక్టు కూడా ఎందుకు పూర్తి కాలేదు?: మంత్రి అనిల్
- ప్రాజెక్టుల అంశంపై మంత్రి అనిల్ ప్రెస్ మీట్
- చంద్రబాబు, టీడీపీ నేతలపై విమర్శలు
- ప్యాకేజీల కోసం పోలవరం తాకట్టుపెట్టారంటూ ఆరోపణ
- నిధుల కొరత అందుకే వచ్చిందని వెల్లడి
ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టీడీపీ అధినేత చంద్రబాబుపైనా, గత ప్రభుత్వంపైనా విమర్శనాస్త్రాలు సంధించారు. గత సర్కారు ఐదేళ్ల పాటు మొద్దు నిద్రపోయి, ఎన్నికల ముంగిట ప్రాజెక్టులకు టెండర్లు పిలిచిందని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.50 వేల కోట్లు ఖర్చు చేశామని టీడీపీ వాళ్లు చెబుతున్నారని, అన్నివేల కోట్లు ఖర్చు చేస్తే ఒక్క ప్రాజెక్టు అయినా ఎందుకు పూర్తి కాలేదని సూటిగా ప్రశ్నించారు.
గట్టిగా అడిగితే పట్టిసీమ గురించి చెబుతారని, వైఎస్సార్ హయాంలో పూర్తి చేసిన కుడికాల్వకు కేవలం లిఫ్ట్ ఏర్పాటు చేసి రూ.1300 కోట్లతో పట్టిసీమను తామే పూర్తి చేశామని టీడీపీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటు అని మంత్రి అనిల్ కుమార్ విమర్శించారు. 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేశాను అని చెప్పుకునే చంద్రబాబు... నేను మొదలు పెట్టి నేను పూర్తి చేశాను అని చెప్పుకోగలిగే ఒక్క ప్రాజెక్టయినా ఉందా?అని ఎద్దేవా చేశారు.
నీరు-చెట్టు అంటూ రూ.25 వేల కోట్లు దుర్వినియోగం చేశారే తప్ప, రాష్ట్రానికి ప్రాజెక్టుల పరంగా చేసిందేమీ లేదని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసినదానికంటే తమ ప్రభుత్వం రెండేళ్లలో చేసిందే ఎక్కువని మంత్రి అనిల్ స్పష్టం చేశారు. టీడీపీ తన ప్యాకేజీల కోసం పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టింది నిజం కాదా? అని ప్రశ్నించారు. అందువల్లే ఇవాళ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు నిధుల కొరత ఉత్పన్నం కావడం వాస్తవం కాదా? అని నిలదీశారు.