Telangana: తెలంగాణలో అప్పుడే మొదలైన చలి.. పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
- రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు ఇదే పరిస్థితి
- తెలంగాణవైపుగా తక్కువ ఎత్తులోకి గాలులు
- ఈ ఏడాదిలోనే అత్యల్పంగా ఆదివారం నాటి ఉష్ణోగ్రతలు
తెలంగాణలో అప్పుడే చలి మొదలైంది. రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. మరో మూడు రోజులు ఇలానే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తర, ఈశాన్య భారతం నుంచి తెలంగాణ వైపుగా తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు.
హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం రాత్రి సంగారెడ్డి జిల్లా నల్లవెల్లిలో అత్యల్పంగా 15.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆదిలాబాద్లో 16.8, హైదరాబాద్లో 18.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు అధికారులు తెలిపారు. రాత్రి ఉష్ణోగ్రతలు ఇంత కనిష్ఠంగా నమోదు కావడం ఈ ఏడాది ఇదే తొలిసారని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. అలాగే, ఈశాన్య రుతుపవనాలు నిన్న ఆగ్నేయ దిశ నుంచి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించినట్టు పేర్కొన్నారు.