Hyderabad: దక్షిణాదిలోనే తొలిసారి.. కూలింగ్ బెలూన్ చికిత్స ద్వారా గుండె వేగాన్ని నియంత్రించిన ఏఐజీ వైద్యులు

AIG Hospital treats two heart patients with Cooling Balloon System

  • ఇద్దరు రోగులకు విజయవంతంగా చికిత్స చేసిన వైద్యులు
  • 3డీ ఇమేజ్ ద్వారా గుండె లయ దెబ్బతినడానికి కారణమైన కండరం గుర్తింపు
  • మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతను సృష్టించడం ద్వారా విద్యుత్ ప్రసారం ముందుకు కదలకుండా చేసిన వైద్యులు
  • ఈ విధానంలో గుండె వేగంలో మళ్లీ మార్పులు రాబోవన్న ఆసుపత్రి హెచ్‌వోడీ డాక్టర్ సి.నరసింహన్

హైదరాబాద్‌లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) వైద్యులు రికార్డు సృష్టించారు. దక్షిణాదిలోనే తొలిసారి కూలింగ్ బెలూన్ చికిత్స ద్వారా లయ తప్పిన గుండెను క్రమబద్ధీకరించారు. సాధారణంగా ఆరోగ్యవంతుల గుండె నిమిషానికి 72-84 సార్లు కొట్టుకుంటుంది.

అయితే, గుండె కండరాల్లో లోపాలు, ఇతర సమస్యల కారణంగా కొందరిలో ఇది కాస్తంత ఎక్కువగా ఉంటుంది. మరికొందరిలో వేగం నెమ్మదిస్తుంది. గుండె వేగం నెమ్మదిస్తే పేస్ మేకర్ సాయంతో సాధారణ స్థితికి తేవొచ్చు. ఒకవేళ ఎక్కువగా కొట్టుకుంటే కనుక సాధారణ స్థితికి తీసుకురావడానికి కొంత కష్టపడాల్సి ఉంటుంది. ఇలాంటి వారిలో వేగాన్ని నియంత్రించేందుకు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ (ఆర్ఎఫ్ఏ) సాంకేతికతను ఉపయోగించి చికిత్స అందిస్తున్నారు.

తాజాగా ఇలాంటి సమస్యతో ఆసుపత్రిలో చేరిన ఇద్దరు రోగులకు ఏఐజీ వైద్యులు ‘కూలింగ్ బెలూన్’ అనే సరికొత్త సాంకేతికతతో సమస్యను అధిగమించేలా చేశారు. ఆసుపత్రి హెచ్‌వోడీ, ఎలక్ట్రోఫిజియాలజీ డైరెక్టర్ డాక్టర్ సి.నరసింహన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ విధానంలో రోగి కాలి నరం నుంచి క్యాథటార్‌ను ఎడమ ధమని  వరకు పంపించారు.

అనంతరం గుండె 3డీ ఇమేజ్ రూపొందించి అది లయ దెబ్బతినడానికి కారణమైన కండరాలను గుర్తించారు. ఆ ప్రదేశంలో మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతను సృష్టించడం ద్వారా కండరాల నుంచి విద్యుత్ ప్రేరణలు ముందుకు వెళ్లకుండా నియంత్రించారు. ఫలితంగా గుండె లయ సాధారణ స్థాయికి చేరుకుంది. ఈ విధానంలో ఒకసారి చికిత్స అందించిన తర్వాత గుండె మళ్లీ మునుపటి స్థాయికి వెళ్లే ప్రసక్తే ఉండదని డాక్టర్ సి.నరసింహన్ వివరించారు.

  • Loading...

More Telugu News