Telangana: కేఆర్ఎంబీకి రెండు లేఖలు రాసిన తెలంగాణ ఈఎన్సీ
- ఏపీపై కేఆర్ఎంబీ చైర్మన్ కు ఫిర్యాదు
- సాగర్ ఎడమ కాలువను పెంచుకుంటున్నారని ఆరోపణ
- కృష్ణా బేసిన్ ఆవలకు నీటిని తరలిస్తున్నట్టు వెల్లడి
- తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతోందని వివరణ
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి తెలుగు రాష్ట్రాల ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. తాజాగా కేఆర్ఎంబీ చైర్మన్ కు తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రెండు లేఖలు రాశారు. సాగర్ ఎడమ కాలువను ఇష్టారీతిలో పెంచుకుంటున్నారని ఏపీపై ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వాలు ప్రాజెక్టు రిపోర్టును ఖాతరు చేయలేదని తెలిపారు.
ఏపీ చేపట్టిన పిన్నపురం ప్రాజెక్టును నిలుపుదల చేయాలని కోరారు. పిన్నపురం ప్రాజెక్టుకు ఏపీ ఎలాంటి అనుమతి తీసుకోలేదని పేర్కొన్నారు. శ్రీశైలం నుంచి ఏపీ 34 టీఎంసీల నీరే తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా బేసిన్ ఆవలకు కూడా ఏపీ భారీగా నీటిని తరలిస్తోందని ఆరోపించారు. ఏపీ తీరుతో తెలంగాణలోని కృష్ణా నదీ పరీవాహక ప్రాంత ప్రాజెక్టులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వివరించారు.
అంతేకాకుండా, ఏపీలో ఆయకట్టు పెరుగుతోందని తెలిపారు. 1952లో ఏపీలో ప్రతిపాదిత ఆయకట్టు 1.3 లక్షల ఎకరాలు ఉండగా, ప్రాజెక్టు రిపోర్టుకు భిన్నంగా 1956 తర్వాత ఆయకట్టు పెంచారని వెల్లడించారు. ఏపీలో ఆయకట్టును 3.78 లక్షల ఎకరాలకు పెంచారని తెలంగాణ ఈఎన్సీ తన లేఖలో తెలిపారు. అదే సమయంలో తెలంగాణలో ఆయకట్టును 60 వేల ఎకరాలకు తగ్గించారని వివరించారు. 1969లో ఏపీలో ఆయకట్టును 1.3 లక్షల ఎకరాలకు కుదిస్తూ ఆదేశాలు వచ్చాయని పేర్కొన్నారు. ఆ ఆదేశాలను పాటించని పరిస్థితి నెలకొందని తెలిపారు.