Cricket: భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్.. భజ్జీ, పాక్ ఫాస్ట్ బౌలర్ ఆమిర్ మధ్య ట్విట్టర్ వార్
- భజ్జీ బౌలింగ్ లో అఫ్రిదీ సిక్సర్లు బాదేశాడంటూ ఆమిర్ సెటైర్
- లార్డ్స్ భారీ ‘నో బాల్’ మరిచావా? అంటూ భజ్జీ కౌంటర్
- స్పాట్ ఫిక్సింగ్ అంశాన్ని గుర్తు చేసిన టర్బొనేటర్
- మీకు డబ్బే కావాలంటూ భజ్జీ ఆగ్రహం
టీ20 వరల్డ్ కప్ లో భారత్ పై పాకిస్థాన్ గెలిచింది మొదలు.. వివాదాలు ముసురుతూనే ఉన్నాయి. షమీపై నెటిజన్లు ట్రోలింగ్ చేశారు. తాజాగా ఇద్దరు క్రికెటర్ల మధ్య వాడీవేడి మాటల యుద్ధమే జరుగుతోంది. భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆమిర్ మధ్య ట్విట్టర్ వార్ సాగుతోంది.
భారత్ ఓటమిపై స్పందించిన మహ్మద్ ఆమిర్.. నిన్న రాత్రి హర్భజన్ సింగ్ బౌలింగ్ లో పాక్ మాజీ డాషింగ్ బ్యాట్స్ మన్ షాహిద్ అఫ్రిది కొట్టిన సిక్సర్లపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు. ‘‘హర్భజన్ బౌలింగ్ లో లాలా (అఫ్రిది) బ్యాటింగ్ చూస్తున్నా. నాలుగు బంతుల్లో నాలుగు సిక్సర్లు బాదేశాడు. క్రికెట్ లో ఇదంతా సహజమే అయినా.. మరీ టెస్ట్ క్రికెట్ లో ఇంతలా బాదడమే కొంచెం ఎక్కువ’’ అంటూ ట్వీట్ చేశాడు. దానికి ఆ యూట్యూబ్ వీడియోను జత చేశాడు.
దానికి స్పందించిన భజ్జీ.. ‘లార్డ్స్ లో వేసిన నో బాల్ మరిచిపోయావా ఏంటి?’ అంటూ స్పాట్ ఫిక్సింగ్ వివాదాన్ని గుర్తు చేశాడు. ‘‘అంత పెద్ద నో బాల్ అసలెలా వేశావు? ఎంత తీసుకున్నావ్? ఎవరిచ్చారు? టెస్ట్ క్రికెట్ లో మరీ అంత దారుణమైన నో బాల్ ఎలా సాధ్యం? ఇంత అందమైన ఆటకు కళంకం తీసుకొస్తున్నారు. నీకు, నీకు మద్దతిస్తున్న వారికి కొంచెమైనా సిగ్గుండాలి’’ అని పేర్కొంటూ ఆమిర్ నో బాల్ వేసిన ఫొటోను జత చేశాడు.
అయితే, అది అక్కడితో ఆగిపోలేదు. ఆమిర్ మరోసారి రెచ్చగొట్టాడు. ‘‘లాలా వస్తున్నాడు. పారిపో..పారిపో అంటూ’’ కామెంట్ చేశాడు. దానికి హర్భజన్ కూడా అంతే దీటుగా బదులిచ్చాడు. '‘మీలాంటి వాళ్లకు పైసానే కావాలి. సిగ్గుఎగ్గు వంటివేవీ మీకు అవసరం లేదు. కేవలం డబ్బులుంటే చాలు. దీని వల్ల మీకు ఎంత ముట్టిందో మీ దేశ ప్రజలకు చెప్పండి. ఆటను అవమానించి.. మళ్లీ ఏం తెలియనట్టు నటించే మీ లాంటి వాళ్లతో మాట్లాడడమంటేనే నాకు అసహ్యం'’ అన్నాడు.
తర్వాత మహ్మద్ ఆసిఫ్ బౌలింగ్ లో తాను సిక్సర్ బాదిన వీడియోనూ భజ్జీ పోస్ట్ చేశాడు. ‘‘ఫిక్సర్ బౌలింగ్ లో సిక్సర్ కొట్టేశా.. బంతి స్టేడియం అవతల పడింది’’ అంటూ చురక అంటించాడు.