Venkaiah Naidu: ప్రముఖ గాంధేయవాది పద్మశ్రీ ఎస్ఎన్ సుబ్బారావు అస్తమయం.. సంతాపం తెలిపిన ఉపరాష్ట్రపతి
- జైపూర్ లో తుదిశ్వాస విడిచిన సుబ్బారావు
- సుబ్బారావు వయసు 92 సంవత్సరాలు
- దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వైనం
- శ్రమదాన ఉద్యమానికి సుబ్బారావు ఆద్యుడు
ప్రముఖ గాంధేయవాది, పద్మశ్రీ అవార్డు గ్రహీత సలేమ్ నంజుండయ్య సుబ్బారావు కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎస్ఎన్ సుబ్బారావు జైపూర్ లో తుదిశ్వాస విడిచారు. శ్రమదాన ఉద్యమానికి సుబ్బారావును ఆద్యుడిగా పరిగణిస్తారు. ఎస్ఎన్ సుబ్బారావు మృతిపై భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు.
చిన్నతనంలోనే గాంధీజీ బోధనల పట్ల ఆకర్షితులై సామాజిక సేవలోనే సాగిన వారి జీవితం ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఎస్ఎన్ సుబ్బారావు తనతో ఎంతో అభిమానంగా ఉండేవారని వెంకయ్యనాయుడు వెల్లడించారు. యువతను వ్యాయామం వైపు ప్రోత్సహించి వారి జీవితాలను తీర్చిదిద్దారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.