Raghu Rama Krishna Raju: జగన్ అన్న మాటలు ఎవరైనా ఈసీకి చెబితే, పార్టీ గుర్తింపు రద్దవుతుంది: రఘురామకృష్ణరాజు
- అయినా, ఎవరో ఎందుకు నేనే చెబుతా
- కొడాలి నాని, జోగి రమేశ్ అసెంబ్లీలో గొప్ప పదాలు ఉపయోగించారు
- అప్పుడు జగన్ మనసు నొచ్చుకున్నట్టు లేదు
- దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి
తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని వైసీపీ ఎంపీలు ఎన్నికల సంఘాన్ని కోరడంపై ఇప్పటికే టీడీపీ విరుచుకుపడింది. అసభ్య పదజాలం వాడకానికి కేరాఫ్ అడ్రస్ వైసీపీయేనని, తొలుత ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయించుకుని, ఆ తర్వాతే మిగతా పార్టీల గురించి మాట్లాడాలని విజయసాయిరెడ్డికి టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ హితవు పలికారు.
తాజాగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా దీనిపై స్పందించారు. తమ నాయకుడు జగన్ మాట్లాడిన మాటలను ఎవరైనా ఈసీ దృష్టికి తీసుకెళ్తే వైసీపీ గుర్తింపు రద్దవుతుందని అన్నారు. అయినా, ఎవరో ఎందుకని, తానే ఆ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే జోగి రమేశ్ ఎన్నో గొప్ప పదాలు ఉపయోగించారని, అప్పుడు జగన్ మనసు నొచ్చుకోలేదా? అని ప్రశ్నించారు. అసభ్య పదజాలం వాడిన జోగి రమేశ్‌ను జగన్ మెచ్చుకున్నారని గుర్తు చేశారు. అలాంటి వారు ఇప్పుడు వేదాలు వల్లిస్తున్నారని రాఘురామరాజు ఎద్దేవా చేశారు.