RGV: షారుఖ్ ఖాన్ కుమారుడి విడుదలపై తనదైన శైలిలో స్పందించిన రామ్ గోపాల్ వర్మ!
- సాధారణంగా ప్రతి దీపావళికి ఖాన్ల విడుదల ఉంటుంది
- ఈ దీపావళికి కూడా ఖాన్ విడుదలయ్యాడన్న వర్మ
- షారుఖ్ నివాసం మన్నత్ వద్దకు అభిమానులు
ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి ఆర్యన్‌ఖాన్ విడుదలయిన విషయం తెలిసిందే. 22 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైన ఆర్యన్‌ఖాన్ ను షారుఖ్ ఖాన్ స్వయంగా ఇంటికి తీసుకెళ్లాడు. ఈ సమయంలో ఆర్ధర్ రోడ్ జైలు వద్దకు షారుక్ అభిమానులు భారీగా తరలివచ్చారు.
రెండు రోజుల క్రితం ఆర్యన్‌కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పలు వ్యాఖ్యలు చేశారు. 'సాధారణంగా ప్రతి దీపావళికి ఖాన్ల విడుదల ఉంటుంది. ఈ దీపావళికి కూడా ఖాన్ విడుదలయ్యాడు' అని ఆయన చమత్కరించారు.
బాలీవుడ్ లో దీపావళి ముందు గతంలో విడుదలైన ఆమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ల సినిమాలను ఉద్దేశించే వర్మ ఈ ట్వీట్ చేశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు, ఈ నెల 3న రేవ్‌పార్టీ, డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్ చాలా రోజులకి విడుదల కావడంతో షారుఖ్ నివాసం మన్నత్ వద్దకు అభిమానులు భారీగా చేరుకుంటున్నారు.