Pawan Kalyan: బీజేపీని వదిలేసి.. టీడీపీతో కలుస్తారా? అన్న సందేహాలపై స్పష్టత నిచ్చిన జనసేన నేత నాదెండ్ల మనోహర్!
- రాష్ట్రం కోసం ఎవరితోనైనా కలుస్తామంటూ పవన్ వ్యాఖ్యలు
- జనసేనాని వ్యాఖ్యలపై స్పందించిన నాదెండ్ల
- జనసేన పార్టీ ఎన్జీవో కాదు.. ఇదో రాజకీయ పార్టీ
- ఎన్నికలకు సిద్ధమవుతున్నాం
- అందరినీ కలుపుకుని పోరాడాలని భావిస్తున్నామని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఎవరితోనైనా కలుస్తామంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. తాజాగా, ఎన్టీవీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ... 'జనసేన పార్టీ ఎన్జీవో కాదు. ఇదో రాజకీయ పార్టీ. ఎన్నికలకు సిద్ధమవుతున్నాం' అని వివరించారు.
'మా స్వార్థం గురించో, మా లబ్ధి గురించో పని చేయాలనుకోవడం లేదు. కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం మంచి ఉద్దేశంతోనే పని చేస్తోంది. ఆ నమ్మకం మాకు ఉంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసినప్పుడు మూడు అంశాలపై మాట్లాడాము. అమరావతి, ఏపీలో పెట్టుబడులు, ఉపాధి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాం' అని తెలిపారు.
'అంతేతప్ప కేసులు మాఫీ చేయించుకోవడానికి కాదు. మమ్మల్ని రక్షించండి అని కేంద్ర ప్రభుత్వం ముందు మా పార్టీ అడగాల్సిన అవసరం లేదు. ఒక పార్టీకి దగ్గర కావడం కోసం మరో పార్టీని వదులు కోవాల్సిన పనిలేదు. పవన్ కల్యాణ్ ఇటీవల టీడీపీ గురించి ఎక్కువగా ఎందుకు ప్రస్తావిస్తున్నారంటే.. జగన్ వంటి మహానుభావుడి పాలన వల్ల రాష్ట్ర ప్రజలు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో దాడులు జరుగుతున్నాయి. మరి ఏం చేస్తాం? అందరం కలిసీ పని చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాం. టీడీపీ, జనసేన అసెంబ్లీ ఎన్నికల్లో కలిసే అంశంపై భవిష్యత్తులో మాట్లాడుకుందాం' అని తెలిపారు.
దీపావళి తర్వాత కొందరు ముఖ్య నాయకులు తమ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారని నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఏపీ సీఎం జగన్ చాలా మంది సలహాదారులను పెట్టుకున్నారని నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. సీఎం కంటే ముందుగా సలహాదారులే స్పందిస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటే అవి సరికాదన్న విషయాన్ని పవన్ కల్యాణ్ తప్పకుండా నిలదీశారని చెప్పారు.
ఏపీలో పరిస్థితులు బాగోలేవని విమర్శించారు. గంజాయి సాగు పెరిగిందని చెప్పారు. యువకులను గంజాయి సాగులోకి లాగుతున్నారని చెప్పారు. వైసీపీ నాయకత్వం బాధ్యతగా దీన్ని అరికట్టాలని, ఆ పనిచేయట్లేదని చెప్పారు.
ప్రత్యేక హోదా కోసం పార్లమెంటును స్తంభింపజేస్తామని వైసీపీ అప్పట్లో తెలిపిందని, ఇప్పుడు ఆ పని చేయట్లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంతో కనీసం చర్చలూ జరపడం లేదని చెప్పారు. కేసుల గురించి వైసీపీ భయపడుతోందని ఆయన ఆరోపించారు.