Local Body Polls: ఏపీలో నెల్లూరు కార్పొరేషన్, మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
- వివిధ కారణాలతో గతంలో ఎన్నికలకు వెళ్లని స్థానిక సంస్థలు
- ఈ నెల 14 నుంచి 16 వరకు ఎన్నికలు
- 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ
- నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలు
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసినా, కొన్ని కారణాలతో పలు స్థానిక సంస్థలకు, నెల్లూరు కార్పొరేషన్ కు ఎన్నికలు జరగలేదు. ఈ నేపథ్యంలో, నెల్లూరు కార్పొరేషన్, 12 మున్సిపాలిటీలు, 533 పంచాయతీ వార్డులు, 11 జడ్పీటీసీలు, 85 ఎంపీటీసీల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఎన్నికలు జరుపనున్నారు.
పంచాయతీలకు ఈ నెల 14న పోలింగ్ ఉంటుంది. అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు. నెల్లూరు కార్పొరేషన్ తో పాటు మున్సిపాలిటీలకు ఈ నెల 15న పోలింగ్ జరిపి, 17న ఓట్లు లెక్కిస్తారు. ఇక జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 16న పోలింగ్, ఈ నెల 18న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో నేటి నుంచి కోడ్ అమల్లోకి రానుంది.