Mayawati: అఖిలేశ్ వ్యాఖ్యల వెనుక బీజేపీ హస్తం ఉంది: మాయావతి
- జిన్నాను స్వాతంత్ర్య సమరయోధుడు అన్న అఖిలేశ్
- బీజేపీ, ఎస్పీలు కలిసి డ్రామా ఆడుతున్నాయన్న మాయావతి
- కులాలు, మతాల మధ్య గొడవలు పెట్టడం వీటికి అలవాటేనంటూ మండిపాటు
పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా స్వాతంత్ర్య సమరయోధుడు అంటూ సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు విమర్శలపాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందిస్తూ... అఖిలేశ్ వ్యాఖ్యల వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు. ఈ రెండు పార్టీలకు మధ్య మంచి ఒప్పందం ఉందని... రెండు పార్టీలు కలసి ఆడుతున్న డ్రామా ఇది అని అన్నారు.
ముస్లింలపై ద్వేషాన్ని పెంచడం, హిందువుల ఓట్లను కొల్లగొట్టడం వంటి కుట్రలు ఈ వ్యాఖ్యల వెనుక ఉన్నాయని చెప్పారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఈ రెండు పార్టీల డ్రామాలు మరింత ఎక్కువవుతాయని అన్నారు.
ఈ రెండు పార్టీల నైజం ఒకేలా ఉంటుందని... కులాలు, మతాల మధ్య గొడవలు పెట్టి, లబ్ధి పొందడం వీటికి అలవాటేనని మాయావతి దుయ్యబట్టారు. యూపీలో సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉంటే... కేంద్రంలో బీజేపీ బలంగా ఉంటుందని అన్నారు. అందుకే బీఎస్పీ అధికారంలోకి రాకూడదని బీజేపీ కోరుకుంటుందని మండిపడ్డారు.