NEET-2021: నీట్-2021 ఫలితాలు వెల్లడి... విజయవాడ విద్యార్థి రుషీల్ కు 5వ ర్యాంకు
- నీట్ ఫలితాలు వెల్లడించిన ఎన్టీయే
- పీవీ కౌశిక్ రెడ్డికి 23వ ర్యాంకు
- మృణాల్ కుట్టేరీకి 1వ ర్యాంకు
- 720/720 మార్కులు సాధించిన టాప్-3 ర్యాంకర్లు
జాతీయ వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్-2021 ఫలితాలు వెల్లడయ్యాయి. జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (ఎన్టీయే) ఫలితాలను విడుదల చేసింది. ఏపీలో విజయవాడ విద్యార్థి రుషీల్ కు 5వ ర్యాంకు, పీవీ కౌశిక్ రెడ్డికి 23 ర్యాంకు లభించాయి. కౌశిక్ రెడ్డి కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవీలత కుమారుడు. తెలంగాణలో జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన శరణ్య 60వ ర్యాంకు సాధించింది.
ఇక జాతీయస్థాయిలో మొదటి ర్యాంకును మృణాల్ కుట్టేరీ సాధించాడు. తన్మయ్ గుప్తా, కార్తీక జి నాయర్ రెండు, మూడు ర్యాంకుల్లో నిలిచారు. టాప్-3లో నిలిచిన ఈ ముగ్గురు ర్యాంకర్లకు 720/720 మార్కులు లభించినట్టు వెల్లడైంది. నీట్-2021 ఈ ఏడాది సెప్టెంబరు 12న దేశవ్యాప్తంగా నిర్వహించారు. మొత్తం 16 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.